మంచి సందేశంతో రూపొందించిన ‘నిన్ను నన్ను కన్న ఆడది.. రా’ పాటను రాష్ట్ర మంత్రి సీతక్క విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ “ఒక అద్భుతమైన ఆలోచనతో సమాజంలో మార్పు తీసుకురావడానికి ఈ పాట చేసిన రమణా రెడ్డి, ఆలీకి కృతజ్ఞతలు. కామంతో కళ్ళు మూసుకునిపోయి మృగంలా ప్రవర్తించే వారిలో మార్పు రావాలి. కులం, మతం, వృత్తితో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వీటిని అరికట్టడానికి ప్రభుత్వం తరుపున ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ పాట ఒక మంచి తొలి అడుగులా కనిపిస్తుంది. ఈ పాట అందరిలో మార్పును తీసుకొస్తుందని కోరుకుంటున్నాను. మనం అందరం ఆడపిల్లను కాపాడుకుందాం-”అని అన్నారు.
ఆలీ మాట్లాడుతూ “ఈ పాట చేయడానికి ముఖ్య కారణం మనం ప్రస్తుతం బయట చూస్తున్న పరిస్థితులు. క్యాన్సర్ కంటే దారుణంగా వ్యాపిస్తుంది ఈ రేప్ అనే వ్యాధి. నాకు ఈ పాట వినగానే యమలీల సినిమాలోని పాట గుర్తొచ్చింది. దర్శకుడు రమణా రెడ్డి ఇక్కడ నుండి అమెరికా వెళ్లి మన దేశానికి ఏమైనా చేయాలని అనుకుని తిరిగి వచ్చి ముందుగా ఈ పాటతో మొదలు పెట్టాడు. పాట విన్న వెంటనే నేను ఈ పాటని మన రాష్ట్రానికి, ఆడవారికి అంకితం చేయాలని అనుకున్నాము. ఈ పాట పూర్తిగా అన్ని చానల్స్, ఆడియో కంపెనీలకు ఉచితం. కేవలం మంచి అనేది అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేశాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రమణారెడ్డి, బీఆర్కే న్యూస్ అధినేత బొల్లా రామ కృష్ణ, నటుడు శ్రీనివాస్, నటి మంజుల, జుబేదా ఆలీ తదితరులు పాల్గొన్నారు.