Monday, December 23, 2024

జనాలకు దడదడలే.. మరో ఐదేళ్లు అత్యధిక ఉష్ణోగ్రతలు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఇప్పటికే ఎండలు మాడుపగులుస్తున్న వేళ వచ్చే ఐదేండ్లు మరింత తీవ్రస్థాయి వేడిమి ఉంటుందని వెల్లడైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2015 నుంచి 2022 వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అయితే ఇంతటితో దీని నుంచి మానవాళికి ఉపశమనం లేదని, మరో ఐదేళ్లు అంటే 2023 నుంచి 2028 వరకూ ఇప్పటికన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక వాతావరణ విభాగం తెలిపింది. ప్యారిస్ క్లైమెట్ సదస్సులు. అడపాదడపా సాగుతోన్న పలు ప్రపంచ స్థాయి వాతావరణ సదస్సులు, తీర్మానాలు, లక్షాలకు అతీతంగా ప్రపంచంలో వేడిమి పెరుగుతూ , కొన్ని ప్రాంతాలలో నిప్పుల కొలిమి వంటి వాతావరణం నెలకొంటోంది.

ఓ వైపు పారిశ్రామిక కాలుష్యంతో వెలువడుతున్న దట్టమైన కార్బన్ ఉద్గారాలు, దీనికి తోడు సముద్ర ఉపరితలాల వేడిమితో ఏర్పడే ఎల్ నినో పరిణామాలు కలిసి ఇప్పటి తీవ్రస్థాయి ఎండల కాలానికి దారితీస్తోంది. 2015 నుంచి వరుసగా ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలం సగటున కానీ మొత్తం మీద కాని రికార్డు స్థాయి ఎండలతో ప్రపంచ ప్రచండ ఉష్ణోగ్రతల దశలో ఉంటుందని ఐరాస వేదికగా ఉన్న ప్రపంచ వాతావరణ సంస్థ నిపుణులు విశ్లేషించారు. 2015 పారిస్ ఒప్పందంలో ఉష్ణోగ్రతల కట్టడికి, వాతావరణ పరిరక్షణకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. గ్లోబల్ వార్మింగ్‌ను రెండు డిగ్రీల సెల్సియస్ దాటకుండా చేయాలని తీర్మానించారు. 2022లో గ్లోబల్ కనీస ఉష్ణోగ్రతలు 1850 1900 మధ్య కాలంలోని సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 1.15 సెల్సియస్ అధికంగా ఉంది.

విపరీత స్థాయిలో గాలిలో తేమలు మానసిక శారీరక రుగ్మతకు దారితీస్తోందని నిపుణులు విశ్లేషించారు. 2023 నుంచి 2027 వరకూ కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీనితో పారిస్ ఒప్పందం ఖరారు చేసుకున్న ఉష్ణోగ్రతల పరిమితి లక్షం ప్రశ్నార్థకం అయింది. ప్రపంచ స్థాయిలో ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల పరిస్థితి శాశ్వతంగా ఇదే విధంగా ఉంటందని చెప్పలేమని, మనం తీసుకునే చర్యలు సహజసిద్ధంగా సముద్ర ఉపరితలంపై తలెత్తే పరిణామాలతో పరిస్థితిలో మార్పుండవచ్చునని వాతావరణ సంస్థ చీఫ్ పెటెరి టాలాస్ తెలిపారు.
వచ్చే కొద్దినెలల్లో వేడెక్కించే ఎల్ నినో
వచ్చే కొద్ది నెలల్లో అత్యంత వేడిపుట్టించే ఎల్‌నినో ప్రభావం చూపుతుంది. సముద్రంపై నుంచి దూసుకువచ్చే తీవ్ర వేడిగాలులు , పారిశ్రామిక, వాహన కాలుష్య సంబంధిత సమస్యలతో మనిషిని చట్టుముట్టుకుని ఉండే ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుంది. ఉష్ణోగ్రతల అత్యధిక పెరుగుదలల పరిణామంతో పలు రకాల అనారోగ్యాలు, ఆహార భద్రత సమస్యలు తలెత్తుతాయి. నీటి నిర్వహణ క్లిష్టతలు ఏర్పడుతాయి. వీటినుంచి రక్షించుకునేందుకు సిద్ధం కావల్సి ఉందని పెటెరి తెలిపారు. ప్రత్యేకించి మధ్య, తూర్పు మధ్యధరా పసిఫిక్ ప్రాంతాలలో దీని ప్రభావం ఉంటుంది. ఎల్‌నినో పరిణామం ప్రతి రెండు లేదా ఏడేళ్లకోసారి సంభవిస్తుంది. వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఎల్ నినో, లా నినా పరిణామాల నడుమనే సాగుతాయి. జులై చివరిన కానీ సెప్టెంబర్ ఆఖరిన కానీ ఎల్ నినో పరిస్థితి ఏర్పడవచ్చునని విశ్లేషించారు.
1960నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత
భూ ఉపరితలం, సముద్రం ఉష్ణోగ్రతలలో 1960 నుంచి పెరుగుదలలు చోటుచేసుకుంటున్నాయి. 1850 1990 వరకూ సగటున 1.5 సెల్సియస్ పెరుగుదల ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ 2023లో ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలలో పెరుగుతాయి. అలస్కా, దక్షిణాఫ్రికా, దక్షిణాసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని భాగాలు తప్పితే మిగిలిన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News