Monday, December 23, 2024

వడదెబ్బ ప్రమాదం.. జర భద్రం

- Advertisement -
- Advertisement -

భరించలేని వేడి గాలుల సెగల మండు వేసవి వచ్చేసింది. ఎంతో పని ఉంటేనే కానీ బయటకు వెళ్లడం కష్టంగా ఉంటోంది. చాలా చోట్ల 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రాణాలు తీసే వడదెబ్బల ప్రభావం కమ్ముకొస్తోంది. అసలు వడదెబ్బ (heat stroke) అంటే సూర్యుడి వేడి వల్ల వీచే వేడిగాలులే వడగాల్పులు. ఇవి మన కళ్లు, చెవులు ద్వారా శరీరం లోకి ప్రవేశిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను పెంచేస్తాయి. మెదడు, అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి.

దీంతో శరీరం అదుపు తప్పి కొన్ని అవలక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, వాంతులు, మూర్ఛ, అలసట, తలతిరగడంతో స్పృహ కోల్పోవచ్చు. పిల్లలకు, గర్భిణులకు, వయోవృధ్ధులకు , రోగులకు వడదెబ్బలు ప్రాణాంతకమే. ఎండనకా వాననక పనిచేసే కార్మికులు, క్రీడాకారులు కూడా వడదెబ్బకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ విఫలమవుతుంది. వడదెబ్బకు గురైన వారి ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరం లోని ప్రధాన నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే వడదెబ్బ తగిలినప్పుడు వికారం, మూర్ఛ, గందరగోళం, అయోమయంగా ఉంటుంది. స్పృహ కోల్పోయి కోమా లోకి వెళ్లిపోతారు.

Also read:  ఆటోఇమ్యూన్ వ్యాధులపై అశ్రద్ధ పనికిరాదు

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి ?

రోడ్డు పక్కన ఎవరైనా వడదెబ్బతో పడిపోయినా, లేదా మీకే వడదెబ్బ తగిలినట్టు అనిపించినా, తక్షణం ప్రథమ చికిత్స అవసరం. వడదెబ్బకు పడిపోతే వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలి. అంబులెన్స్ వచ్చేలోగా, బాధితుడిని చల్లగా ఉండే ప్రదేశంలో లేదా చెట్టునీడలో ఉంచి ప్రథమ చికిత్స చేయాలి. బాధితుడి ఒంటిపై దళసరి వస్త్రాలు ఉంటే తీసివేయాలి. శరీరానికి గాలి తగిలేలా చూడాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి చల్లని నీడిలో గుడ్డ తడిపి శరీరమంతా తుడవాలి. ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు ఉంటే 101 నుంచి 102 డిగ్రీల ఫారన్‌హీట్‌కు తగ్గించాలి. ఐస్‌ప్యాక్‌లు అందుబాటులో ఉంటే బాధితుడి చంకలు, గజ్జలు, మెడ, వీపు భాగాల్లో ఉంచాలి. ఈ శరీర భాగాల్లో రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి. అవి చల్లబడితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

బాధితుడ్ని షవర్ కిందకు తీసుకెళ్లి స్నానం చేయించినా ఫర్వాలేదు. లేదా చల్లని నీటి టబ్‌లో అయినా ముంచవచ్చు. ఆరోగ్యవంతులైనా, యువకులైనా తీవ్ర వ్యాయామం వల్ల వడదెబ్బకు గురైతే “ఎక్సర్షనల్ హీట్ స్ట్రోక్‌” అంటారు. వీరికి ఐస్‌బాత్ చేయించాలి. వృద్దులు, పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వ్యాయామం చేయని వ్యక్తులు, మద్యం తాగేవాళ్లు వడదెబ్బకు గురైతే ఐస్ లేదా మంచును అసలు ఉపయోగించరాదని వైద్యులు చెబుతున్నారు. వీలైనంతవరకు సాధారణ నీటి తోనే వారి శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ప్రయత్నించాలి.

Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ పండు తినండి..

వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

శిశువులు, నాలుగేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, 65 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు వడగాడ్పులు అత్యంత ప్రమాదకరం. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం, తక్కువ బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక అనారోగ్యం, మద్యపానం, ఉన్నవారికి కూడా వేసవి ప్రాణగండమే. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా టవలు లేదా రుమాలు వంటిది చుట్టుకోవాలి. కళ్లు పొడిబారకుండా ఉండాలంటే సన్‌గ్లాసెస్ తప్పకుండా పెట్టుకోవాలి. తలకు నేరుగా ఎండ తగలకుండా టోపీ పెట్టుకోవాలి. తెల్లని వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి.

Also read: ఆటిజం ప్రాణాల్ని తీస్తుందా ?

నల్లని దుస్తులు వద్దు. బిగుసైన దుస్తులు ధరించడం మంచిది కాదు. వ్యాయామానికి రెండు గంటల ముందు 24 ఔన్సుల ద్రవాన్ని తాగాలని, వ్యాయామం చేసే ముందు మరో 8 ఔన్సుల నీరు లేదా స్పోర్ట్ డ్రింక్‌ని తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలో మీకు దాహం అనిపించక పోయినాసరే ప్రతి 20 నిమిషాలకు మరో 8 ఔన్సుల నీటిని తీసుకోవాలి. కెఫీన్ లేదా ఆల్కహాలు ఉన్న ద్రవాలను అతిగా తీసుకోరాదు. అవి శరీరం లోని ద్రవాలను కోల్పోయేలా చేస్తాయి. శరీరాన్ని వేడెక్కిస్తాయి. వేసవిలో కాసింత ఉప్పు పానీయం తీసుకోవడం మంచిదే. అయితే రక్తపోటు సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవాలి.

Also read: ఏప్రిల్ నుంచి జూన్ వరకు హీట్‌వేవ్ ఎక్కువే : ఐఎండి

వడదెబ్బ నుంచి కోలుకున్నవారు అలసటగా ఉంటారు కాబట్టి కొద్ది రోజుల పాటు పెద్దపెద్ద పనులు చేయకుండా ఉండాలి. అలాగే వ్యాయామం కొన్నాళ్లపాటు చేయరాదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు అయినా బటర్ మిల్కు తాగాలి. పెప్పరమెంట్ ఆయిల్,, లావెండర్ ఆయిలు, ఆల్మండ్ ఆయిల్, కలిపి ఆ మిశ్రమంతో మర్ధన చేయాలి. ఉల్లిగడ్డ రసం, తేనె కలిపి తాగిస్తే మంచిది. ఈ మిశ్రమాన్ని చెవులకు, ఛాతీకి, పాదాలకు పెట్టొచ్చు. కొత్తిమీరి రసం, చింతపండు, తేనె, ఆపిల్ స్లైడ్, వెనిగర్ తాగించాలి. శాండిల్ వుడ్ పేస్ట్ ఒళ్లంతా రాయించి, ఓ పదిహేను నిముషాల తరువాత చన్నీటితో స్నానం చేయించాలి. మసాలా కారం ఎక్కువగా వేసిన వంటకాలు వద్దు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News