దేశంలో ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సంవత్సరానికి సాధారణంగా 4నుండి 6 వడగాలుల సంఘటనలు జరగుతుంటాయి. ఈ వడగాలులు మారిన పరిస్థితుల వల్ల వీటి సంఖ్య 4నుండి 7కు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో వడగాలులు వీచే మండలాల కింద 589మండలాలను గుర్తించారు.
వేడి గాలులు వీచే వాటి కింద 582మండలాలు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. గాలిలో పెరిగిన ఉష్ణోగ్రతల తీవ్రత ప్రజల పైనే కాకుండా మొక్కలు, పశువులు, కోళ్లు ఇతర జీవులపైన ప్రభావం చూపి వాటి పనితీరు వ్యవస్థను తీవ్ర వత్తిడికి గురిచేస్తుందని శాస్త్రవేత్త డా.డి నాగరాజు వెల్లడించారు. వేడి ప్రభావం ఎంత వరకూ చూపుతుందనేది ఒక మొక్క లేదా జీవి తన జీవన విధానాన్ని మారుతున్న వాతావరణం లేదా ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తిమీద, ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే స్థాయి మీద ఆధారపడి ఉంటుంది.
స్వల్పకాలంలో వాతావరణంలో ఎక్కువ మార్పులు సంభవిస్తే ఏ జీవికైనా తన మనుగడను సాగించడం పెద్ద సవాలుగా మారుతుంది. పెరుగుతున్న జనాభాకు సరిపడే ఉత్పత్తి, ఉత్పాదకాలపైన ప్రభావం చూపుతుంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగటం, అదేవిధంగా గాలిలో తేమ శాతం తగ్గటం, వేడిగాలులకు గురి కావ టం వలన మొక్కలతో నీరు త్వరగా ఆవిరై చనిపోయే ప్రమాదముంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో తగిన జాగ్రత్తలు చేపడితే వడగాలుల ప్రభావం తగ్గించి మంచి దిగుబడులు పొందే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.