Friday, October 18, 2024

రాష్ట్ర మంతటా వడగాడ్పులే!

- Advertisement -
- Advertisement -

ఈసారి 568 మండలాల్లో వడగాల్పులు అధికం
మే నెలలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
ఏప్రిల్ నుంచి జూన్ వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు
తగ్గిపోనున్న భూగర్భ జలాలు

sunstroke

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని 589 మండలాలకు గాను 568 మండలాల్లో ఈ సారి వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మ్మెంట్ అథారిటీ, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, యూనిసెఫ్, తెలంగాణ రెవెన్యూ శాఖలు తయారు చేసిన నివేదికలో పేర్కొన్నారు. 49 సెంటీగ్రేడ్‌లు నమోదయ్యే ఛాన్స్75 శాతం ఉందని, 47 డిగ్రీల వరకు వడగాల్పులు వీచే అవకాశం 100 శాతం ఉందని ఈ నివేదికల్లో అధికారులు సూచించారు. ఎండల తీవ్రతపై చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన నివేదికను ఈ విభాగాల అధికారులు సిద్ధం చేశారు.
అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో…
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగలు ఎండలు, రాత్రులు ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. బుధవారం 38.8 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా, అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43 డిగ్రీలుగా రికార్డయ్యింది. దీంతో తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
పొడి వాతావరణంతో నీటి కష్టాలు
ఎండల ప్రభావంతో రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. దక్షిణ తెలంగాణలో ఈ ఏడాది 8 నుంచి 9 నెలల పాటు కరువు ప్రభావం ఉంటుందని రాష్ట్ర వడగాల్పుల ప్రణాళిక నివేదిక స్పష్టం చేసింది. వర్షాకాలంలో మూడు నుంచి నాలుగు నెలల మినహాయిస్తే మిగిలిన కాలంలో పొడి వాతావరణంతో నీటి కష్టాలు ఉంటాయని, ఇది వ్యవసాయంపై ప్రభావం చూపుతుందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, మే నెలలో 47 నుంచి 49 డిగ్రీలకు చేరుతుందని హీట్వేవ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు.
నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కరువు
దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలతో సహా మొత్తం ఉమ్మడి ఐదు జిల్లాల పరిధిలో ఈ ఏడాది కరువు ఉంటుందని, ఎక్సెస్ వర్షపాతం నమోదైనా కరువు ప్రభావం ఉంటుందని హీట్వేవ్ రిపోర్టు వెల్లడించింది. నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కరువు ఉంటుందని ఈ నివేదికలో అధికారులు పొందుపరిచారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతాయని కూడా హెచ్చరించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, యూనిసెఫ్, తెలంగాణ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ నివేదికను సిద్ధం చేశాయి.ఈ ఏడాది మే నెలలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, దీంతో వడదెబ్బ మరణాలు పెరిగే ఛాన్స్‌ఉందని వెల్లడించింది.

Heat Waves warning to 24 districts of Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News