విచారణ శుక్రవారానికి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు, సిఐడి తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో మంగళవారం వాదనలు జరిగాయి. సెక్షన్ 17ఎకు సంబంధించి గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచారు.
రఫేల్ కేసు ఆరోపణలపై 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పు ఇచ్చారని, చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారని కోర్టుకు వెల్లడించారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు ఇన్వేస్టిగేషన్ చేసే హక్కు ఉండదన్నారు. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే అన్నారు. అన్ని రకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఎ తో రక్షణ లభించిందని సాల్వే చెప్పారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను హరీశ్ సాల్వే సుప్రీంకోర్టు ముందుంచారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్ 20(1)పై వచ్చిన తీర్పును సాల్వే ఉదహరించారు.
సెక్షన్ 17ఎకు సంబంధించి చట్ట సవరణ ముందు ఉన్న అంశాలకూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదని జస్టిస్ బోస్ అన్నారు. ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సాల్వే వాదించారు. అసలు కేసులో ప్రజాప్రతినిధి భాగస్వామ్యం ఏంటని విచారణకు ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరన్నారు. 2011 దేవిందర్ పాల్సింగ్ బుల్లర్ కేసును హరీష్ సాల్వే ప్రస్తావించారు. ఈ కేసు ప్రారంభమే చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తర్వాత పరిణామాలేవీ చట్టబద్ధం కావని బుల్లర్ కేసులో తీర్పు ఉందన్నారు. కేసు ప్రారంభం చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాన్నే తిరస్కరించాల్సి ఉంటుందన్నారు. ఈ కేసు మూలంలోనే దోషం ఉంది కాబట్టి బుల్లర్ కేసును పరిగణనలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నానని సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు.
చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌నే సవాల్ చేస్తున్నానన్నారు. అన్నింటిని కలిపేసి ఒక ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారని, దాన్నే తాను సవాల్ చేస్తున్నానన్నారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ చట్టబద్ధం కాదని, ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు ఎక్కడా లేదన్నారు. డిజైన్ టేక్ లబ్ధి చేకూర్చడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగమని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు.
సాల్వే వాదనలు అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 17ఎ పై హైకోర్టులు ఏం చెప్పాయి అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదని, 17ఎపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనే పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణలో సెక్షన్ 17ఎ చుట్టూ వాదనలు నడుస్తున్నాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు పూర్తి చేయగా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిందని రోహత్గీ అన్నారు. హరీశ్ సాల్వే కూడా చంద్రబాబు తరపున హైకోర్టులో వాదించారన్నారు. రోహత్గీ వాదనలను అడ్డుకునేందుకు సిద్ధార్థ లూథ్రా ప్రయత్నించగా, కోర్టు వారించింది. సెప్టెంబర్ 19న విచారణ రోజే ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను చంద్రబాబు లాయర్లతో పాటు కోర్టుకు అందించామన్నారు. ఈ కేసులో ఎలాంటి పత్రాలు అందలేదని చంద్రబాబు లాయర్ల వాదనలో వాస్తవం లేదన్నారు. దాదాపు 40 పేజీల కౌంటర్ అదే రోజు సిఐడి హైకోర్టుకు సమర్పించిందన్నారు. తమకు వాదనలు వినిపించేందుకు అవకాశం లభించలేదని ఎందుకు హైకోర్టులో చంద్రబాబు లాయర్లు చెప్పలేదన్నారు. 2018లో ప్రారంభమైన విచారణకు పాత చట్టాలే ఆధారంగా తీసుకోవాలని రోహత్గీ సుప్రీంకోర్టును కోరారు.
2018లో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడే విచారణ ప్రారంభమైందన్నారు. 2021 డిసెంబర్ 9న ఎఫ్‌ఐఆర్ నమోదైందని వెల్లడించారు. 2023 సెప్టెంబర్ 8న విచారణ సందర్భంగా చంద్రబాబు నిందితుడు అనేది వెలుగులోకి వచ్చిందన్నారు. చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్టు చేశారని, ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు అనేదే లేదన్నారు. 2018 మే 14న జీఎస్టీ పూణే నుంచి ఫిద్యాదు అందిందని ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. జిఎస్‌టి అధికారుల లేఖ ఆధారంగానే విచారణ చేపట్టినట్లు సిఐడి డీజీ కోర్టు అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నారని ముకుల్ రోహత్గీ వాదించారు. 17ఎ ఈ కేసుకు వర్తించదన్నారు. ఈ పిటిషన్‌ను వెంటనే డిస్మిస్ చేయాలని కోర్టును కోరారు. ఈ కేసు పిసి యాక్ట్ తో పాటు ఐపిసి సెక్షన్లకు సంబంధం ఉన్న కేసు అన్నారు. పిసి యాక్ట్ లేకపోతే ఏం జరుగుందని రోహత్గీని కోర్టు ప్రశ్నించారు. పిసి యాక్ట్ లేకపోయినా ఈ కేసు ఉంటుందని, విచారించే హక్కు ట్రయల్ కోర్టుకు ఉంటుందన్నారు. పిసి యాక్ట్ ఐపిసి సెక్షన్లకు సిబిఐ, ఇడి విచారణలాగే పరిగణించాలన్నారు. సిబిఐ కేసు వీగిపోయినా, ఇడిలో విచారణ జరగవచ్చన్నారు. కాబట్టి రెండు వేరు వేరు కేసులుగానే పరిగణించాలన్నారు. ఈ కేసులో పిసి యాక్ట్ తీసేసే అవకాశమే లేదన్నారు. ఒకవేళ పిసి యాక్ట్ పోయినా మిగిలిన సెక్షన్లు ఉంటాయన్నారు.