Saturday, December 28, 2024

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ‘వడ దెబ్బ’!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణలో బడా నాయకుల సభలకు ప్రజలను తీసుకు రావడం ఇప్పుడు చాలా పార్టీలకు కష్టమైపోయింది. దాంతో అనేక సభలను, రోడ్ షోలను  తగ్గించేసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది. ఎండలు ఇటు తెలంగాణలోనూ,అటు ఆంధ్రలోనూ రాజకీయ పార్టీల ప్రచారానికి పెద్ద అడ్ఢంకిగా తయారయ్యాయి. ఆంధ్రలోనైతే అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ కూడా దాటుతోంది. వడ దెబ్బకి ఇరు రాష్ట్రాలలో అనేక మంది చనిపోయారు కూడా. వచ్చే వారం అయితే ఎండలు మరింత తీవ్రం కానున్నాయి.

మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ప్రజలు బయట తిరగొద్దని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 తర్వాత నుంచి సాయంత్రం 5.00 వరకు ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. నంద్యాల జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రత 47.7 డిగ్రీల సెల్సియస్ దాటింది. ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి.

తెలంగాణలో కూడా గరిష్ఠంగా 42 డిగ్రీల సెల్సియస్ ఎండలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 3 నుంచి 4 పబ్లిక్ మీటింగ్ లలో ప్రసంగిస్తున్నారు. ఆయన తన ఆరోగ్యం గురించి  కూడా పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఆయన హెలికాప్టర్ ద్వారా ఆయా నియోజకవర్గాలకు సమయానికి చేరకుంటున్నారు.

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అయితే చాలా వరకు సాయంత్రం దాటాకే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయన బస్సు యాత్ర ద్వారా రోజుకు ఒకటి లేక రెండు పబ్లిక్ మీటింగ్ లలో ప్రసంగిస్తున్నారు. బిజెపి చెవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే ఇటీవల తాండూర్ సెగ్మెంట్ లో ప్రచారం చేస్తూ డీహైడ్రేషన్ కు గురయ్యాడు. ఇప్పుడాయన ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను త్రాగు నీటితో కలుపుకుని ప్రచారం చేస్తున్నాడు. అసదుద్దీన్, అక్బరుద్దీన్, మాధవీలత అయితే పొద్దున, సాయంత్రం అన్న తేడా లేకుండా ప్రచారం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే రోజుకు రెండు మూడు జిల్లాల్లో బస్సు యాత్ర కొనసాగిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయన రోడ్ షోకు జనం కూడా బాగానే వస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అయితే హెలికాప్టర్ లో తిరుగుతూ రోజుకు రెండు మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News