Sunday, January 19, 2025

తెలంగాణపై చలి పంజా

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. మంచు, చలిగాలుల ధాటికి జనం వణికిపోతున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చలి గాలులు విజృంభిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల ప్రభావంతో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలలో చలి ప్రభావం ఎక్కువైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శీతల గాలుల నేపథ్యంలో ఇప్పటికే ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో 15 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లాలో 11 డిగ్రీలు, కామారెడ్డి, కరీంనగర్, మెదక్‌లో కూడా 11 నుంచి 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దాదాపుగా ఇదే పరిస్థితి రానున్న ఐదు రోజుల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని, ఉదయం, సాయంత్రం వేళల్లో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.

ప్రధానంగా రాష్ట్రంలో చలి తీవ్రత, ప్రభావం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు స్కూళ్లు నడపాలని ఆదేశించింది. ప్రస్తుతం 9.15 నుంచి సాయంత్రం 4.15 వరకు పాఠశాలలు నడుస్తున్నాయి. కాగా, తాము చలితో ఇబ్బందులు పడుతున్నామని, పాఠశాలల వేళలు మార్చాలని ఇంకా పలు జిల్లాల విద్యార్థులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఇదే విధంగా మరో ఐదు రోజులపాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రారంభవ అవుతోంది. ఇక ఉదయం 10 గంటల వరకు చలి తగ్గకపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లటి గాలుల వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి.

ఈ క్రమంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతాయని, ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొగమంచు అధికంగా ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలోనే కాదు మిట్ట మధ్యాహ్నం కూడా ఈదురు గాలులు వీస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News