విద్యుత్ బిల్లుల రీడింగ్‌లో ఆలస్యం
రూ.3.60 పైసలకు బదులుగా రూ.6.90 పైసలు
చెల్లిస్తున్న వినియోగదారులు
త్వరలోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజా సంఘాల నాయకుల నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ శాఖ తరఫున బిల్లులు తీసే ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల శ్లాబ్ రేటులు మారిపోయి కరెంట్ బిల్లులు అదనంగా వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మాములుగా అయితే 30 రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుంచి 40 రోజుల వరకు ఉద్యోగులు బిల్లులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలను ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఉద్యోగులు 2 రోజులు ఆలస్యంగా తీయడం వల్ల 2 రోజుల్లో వచ్చే 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వస్తోంది. దీంతో 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలుగా వినియోగదారులు చెల్లించాల్సి వస్తుంది. ఇలా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తూ అదనంగా బిల్లులు చెల్లించేలా చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్లక్ష్యంగా బిల్లులు తీసే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి: యర్రమధ కృష్ణారెడ్డి
నిర్లక్ష్యంగా బిల్లులు తీసే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యర్రమధ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంమై ప్రజా సంఘాల నాయకులు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై త్వరలో జిల్లా, డివిజన్, మండల విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియచేశారు.