Sunday, January 19, 2025

సాగర్‌లో జలసవ్వడి

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుండటంతో రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. సోమవారం ఎన్‌ఎస్‌పి అధికారులు సాగర్ ప్రాజెక్టుకు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొదట పది గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణ్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అక్కడి నుంచి వరద నీరు మొత్తం ఇప్పుడు నాగార్జునసాగర్‌లోకి వచ్చి చేరుతోంది. దీంతో రెండేళ్ల తర్వాత నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. చివరిసారిగా 2022 ఆగస్టు 11న క్రస్ట్ గేట్లను ఎత్తారు.

ఈసారి వర్షాలు బాగా కురవడం, ఎగువ నుంచి వర్షాలు బాగా పోటెత్తడంతో అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాగర్ ప్రాజెక్టులో సరిగ్గా సోమవారం ఉదయం 11 గంటలకు రెండు గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు పది గేట్లు ఐదు ఫీట్లు మీద ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నాగార్జునసాగర్ డ్యాం ఎస్‌ఇ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎడమకాలువ ద్వారా 9 నుండి పది వేల క్యూసెక్కుల నీరు వదిలి పాలేరు చెరువులను నింపిన తర్వాత రెండు ఆయకట్టలకు పుష్కలంగా నీరు వస్తుందని అన్నారు. దాదాపు నాగార్జునసాగర్ డ్యాం 590 అడుగుల మేరకు చేరుతుందని తెలిపారు. పైన ఉన్న శ్రీశైలం డ్యాంకు భారీ వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ డ్యాంకు భారీగా వరద నీరు పెరిగినందున ఈఎన్‌సి అధికారుల సూచనతో ఇరిగేషన్ శాఖ మంత్రి సూచన మేరకు సోమవారం ఉదయం గేట్లు ఎత్తారని తెలిపారు.

పైనుండి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకొని విడతల వారీగా 14 గేట్లను ఎత్తి సాగర్ డ్యాంపై బరువు పడకుండగా వరద ప్రవాహం అంచనా వేసి నీటిని దిగువకు విడుదల చేస్తామని తెలిపారు. సోమవారం సాయంకాలానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మొత్తం 16 గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ డ్యాం ఎస్‌ఇ నాగేశ్వరరావు, ఈఈ మల్లికార్జునరావు, డిఇ శ్రీనివాస్, జైఇ కృష్ణయ్య, డ్యామ్ స్పెషల్ ప్రొటెక్షన్, ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News