Thursday, November 14, 2024

సముద్రంపాలైన 4604 టిఎంసిలు

- Advertisement -
- Advertisement -

నైరుతి రుతుపనాలు కరుణించాయి. పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు తెలుగు రాష్ట్రాల కరువు తీర్చాయి. జూన్‌లో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ జూన్ రెండ వారం నుంచే చెదురు మొదురు వర్షాలతో పరివాహకంగా ఉన్న వాగులు వంకల్లో నీటి ప్రవాహాలు ప్రారంభమై చెరువుల కుంటలు నింపేస్తూ ఉపనదులు కలిసి ప్రధాన నదుల్లో కదలిక తెచ్చాయి. ఈ సీజన్‌లో నాలుగ నెలల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల మీదుగా కృష్ణా, గోదాదవరి నదుల ద్వారా 4604టిఎంసిల నీరు వృధాగా సముద్రంలోకి కలిసి పోయింది. గత ఏడాది వ్యవసాయరంగాన్ని అటుంచి, తాగునీటికి సైతం కటకట మనిపించిన కృష్ణమ్మ ఈ సారి తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులను మూడు సార్లు నింపేసింది. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో ఇప్పటివరకూ మొత్తం 985టిఎంసిల నీరు చేరింది. అటు తుంగభద్ర నది నుంచి వరద ప్రవాహాలు కృష్ణాతో పోటి పడ్డాయి. సుంకేసుల బ్యారేజి మీదుగా తుంగభద్ర జలాలు 348 టిఎంసిలు దిగువకు ప్రవహించాయి. ఇటు కృష్ణా ,అటు తుంగభద్ర నదుల ద్వారా సోమవారం నాటికి శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 1333టిఎంసిల నీరు చేరుకుంది.

సాగర్‌కు 892టిఎంసిలు:
ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో ఇప్పటివరకూ మొత్తం 892టిఎంసిల నీరు చేరుకుంది. నాగార్జున సాగర్ నుంచి దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి 601టిఎంసిల నీరు చేరగా, కృష్ణానదికి చిట్టచివరి ఆనకట్టగా ఉన్న ప్రకాశం బ్యారేజిలోకి ఎగువ నుంచి ఇప్పటి వరకూ 806టిఎంసిల నీరు చేరింది. ప్రకాశం బ్యారేజి మీదుగా దిగువన సముద్రంలోకి గత ఏడాడి జూన్ ప్రారంభం నుంచి ఈ ఏడాది మే చివరి నాటికి మొత్తం 62టిఎంసిల నీరు మాత్రమే సముద్రంలో కలిసిపోయింది.అదే ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ ప్రకాశం బ్యారేజి మీదుగా 726టిఎంసిల నీరు సముద్రంలోకి జారుకుంది.

గోదావరి నుంచి 3878టిఎంసిలు సముద్రం పాలు :
ఎగువ గోదావరిలో ఆశించిన రీతిలో వర్షాలు వరదలు లేనప్పటికీ మధ్య ,దిగువ గోదావరి నదీపరివాహంగా ఈ సారీ వర్షాలు దంచి కొట్టాయి. ప్రధానంగా మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టును దాటుకుని తెలంగాణ రాష్ట్ర ముఖద్వారంలో ఉన్న శ్రీరాం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఇప్పటివరకూ చేరిన గోదావరి జలాలు 236టిఎంసిలు మాత్రమే. దిగువన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా 289 టిఎంసిలు చేరాయి. గోదావరి బేసిన్ పరిధిలోని చత్తిస్‌గడ్ ,మహరాష్ట్రా ప్రాంతాల్లో కురిసిన భారీన వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కింది. మేడిగడ్డకు ఈ సారి భారీగా వరదనీటిని మోసుకొచ్చిన ఈ నది గోదావరినే మించిన రీతిలో ఉగ్రరూపం చూపింది. సీలేరు ,శబరి ,ఇంద్రావతి నదులు ద్వారా కూడా ప్రధాన గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఉపనదుల ఉధృతితో గోదావరి నదికి చిట్ట చివరి ఆనకట్టగా ఉన్న ఏపిలోని కాటన్ బ్యారేజిలోకి 3995టిఎంసిల నీరు చేరింది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ ధవళేశ్వరం కాటన్ బ్యారేజి మీదుగా సముద్రంలోకి 3878టిఎంసిల గోదావరి జలాలు జారిపోయాయి.గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే వరకూ 2828టిఎంసిల నీరు సముద్రం పాలుకాగా, ఈ ఏడాది ఇప్పటికే గత ఏడాదికంటే 1050 టిఎంసిలు అధికంగా గోదావరి నదీజలాలు సముద్రంలోకి చేరిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News