Wednesday, January 22, 2025

ముమ్మరంగా వరికోత పనులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 6500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వరి పంటకోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బోరు బావుల నీటి ఆధారంగా ముందస్తుగానే వరినాట్లు పూర్తిచేసుకున్న ప్రాంతాల్లో గత పదిరోజలు కిందటి నుంచే వరికోత పనులు చేపట్టారు.  ధాన్యం ఆరబోసి కొనుగోలు కేంద్రాలకు కూడా చేరవేస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కింద ఆహార ధాన్యాలు,పప్పుధాన్యాలు ,నూనెగింజలు తదితర అన్ని రకాల పంటలు కలిపి కోటి 26లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వ్యవసాయ శాఖ సాధారణ సాగు ప్రణాళిక అంచనాల కంటే రెండు లక్షల ఎకరాల్లో అధికంగానే పంటలు సాగులోకి వచ్చాయి. అయితే మొత్తం సాగువీస్తీర్ణంలో వరి పంట వీస్తీర్ణం 50శాతం ఆక్రమించింది. వరి సాధారణ సాగు వీస్తీర్ణం 49.86లక్షల ఎకరాలుగా అంచనా వేయగా, ఈ సారి మొత్తం 65లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్‌సీజన్‌లో సాగులోకి వచ్చిన వరి విస్తీర్ణం కంటే 56వేల ఎకరాల్లో అధికంగా సాగుచేశారు. వరిసాగు విస్తీర్ణం పంట దిగుబడి అంచనాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నెల రోజుల కిందటే ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికను సిద్దం చేసివుంచింది.

రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 6500 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాలను అన్ని ఒకే సారి ప్రారంభించకుండా దశల వారీగా ఏర్పాటు చేయనుంది. వరికోతల ఆధారంగా దశల వారీగా ఆయా జిల్లాల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లనుంచి ఇప్పటికే వరికోతల పనుల ప్రక్రియ , ధాన్యం దిగుబడులు ,ధాన్యం మార్కెట్లలో విక్రయానికి తరలించే సమయం తదితర అంశాలతో కూడిన నివేదికలు ప్రభుత్వానికి చేరటంతో ఆ మేరకు రాష్ట్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రణాళికు రూపొందించింది. సెర్ప్, డిసిఎంఎస్, వ్యసాయసహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేపట్టింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సామాగ్రిని కూడా సిద్దంచేసివుంచింది. టార్పాలిన్ పట్టాలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు,ధాన్యంలో తేమ శాతం పరీక్షించే యంత్రాలు , ధాన్యం శుద్దిచేసే ప్యాడీ క్లీనర్లు , గన్ని సంచులు తదితర వాటిని అవసరాలకు తగ్గట్టుగా ఆయా కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేస్తోంది.

కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 2203
కేంద్ర ప్రభత్వం ఖరీఫ్ సీజన్‌లో పండిన ధాన్యానికి కనీస మద్దతు ధరలను ఇప్పటికే ప్రకటించింది. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2203, సాధారణ రకం ధాన్యానికి రూ.2183 ప్రకటించింది. ధాన్యంలో తాలు తప్పలు ,మట్టి పెళ్లలు వంటివి లేకుండా శుభ్రపరుచుకుని, ధాన్యాన్ని ఆరబెట్టుకుని నిభంధనల మేరకు 17శాతం మించకుండా తేమశాతం ఉండేలా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు రైతులకు వివరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News