న్యూయార్క్ : అంటార్కిటికా హిమానీనదాల్లో తేలియాడే మంచుపలకలు కరిగిపోతుండడాన్ని గత ఏభై ఏళ్లుగా శాటిలైట్ల ద్వారా శాస్త్రవేత్తలు ఎప్పడికప్పుడు అధ్యయనం చేస్తున్నప్పటికీ తూర్పుబాగంలోని 450 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన కాంగెర్ అనే హిమఖండంలో దాదాపు 200 మైళ్ల విస్తీర్ణం కలిగిన భారీ మంచుపలక ఈనెల కూలిపోయింది. విల్కెస్ ల్యాండ్ అనే పేరుగల హిమఖండంలో ఒక భాగమైన ఈ కాంగెర్ మంచుపలక మార్చినెల మధ్యలో కూలిపోగా మార్చి 17న దీని శాటిలైట్ చిత్రాలను ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటెయొరాలజీ శాస్త్రవేత్తలు మొట్టమొదటి సారి గ్రహించగలిగారు.
అమెరికా లోని నేషనల్ ఐస్ సెంటర్ ఈ వివరాలను వెల్లడించింది. కూలిన ఈ భారీ మంచుపలక పేరు సి38 గా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. వీటి వెనుకనున్న హిమానీనదాలు వేగంగా కరిగిపోతుండడంతో ఈ పరిస్థితికి దారి తీసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచు ఫలకాలు తరిగిపోవడమే కాకుండా సముద్రమట్టాలు భారీగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.పశ్చిమ అంటార్కిటికా భాగంలో చాలావరకు హిమానీనదాలు వేగంగా ప్రవహించడంతో మంచు చాలావరకు కొట్టుకు పోయింది. కాంగెర్ మంచుఖండం వెనుకనున్న రెండు హిమానీ నదాలు చాలా చిన్నవి. ఇవి కూడా కరిగిపోయే పరిస్థితిలో ఉన్నాయి.