భీమగల్ : కొద్ది రోజులుగా జోరుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. దీనికి అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా ఎలాంటి ప్రభుత్వ వేబిల్లు లేకుండా అక్రమ ఇసుక దందా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు గాని, పోలీసులు గాని పట్టుకున్న దాఖలాలు లేవు. అధికారులు మామూళ్ళ మత్తులో మునిగి తెలడంతో చూసి చూడనట్లు ఉండడంతో వారి అనుమతితోనే అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతుంది అనే ఆరోపణలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. బడా భీమ్‌గల్‌లో ఎక్కడ చూసినా ఇసుక డంపులు కనిపిస్తాయి.
బడా భీమ్‌గల్ గ్రామంలో ఇంటి నిర్మాణాలు ఉన్న దగ్గర ఇసుకను డంపు చేస్తూ రాత్రివేళలో టిప్పర్లతో జెసిబి సాయంతో దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతి రోజు రాత్రివేళల్లో చెంగల్ వాడికి రాత్రి 7 గంటల నుండి తెల్లవారుజామున వరకు జోరుగా ఇసుక రవాణా జరుగుతుంది. దీనికి తోడు మితిమీరిన వేగం, మైనర్లుతో వాహనములు నడపడం, రాత్రి వేళల్లో మద్యం మత్తులో ట్రాక్టర్ నడపడంతో గ్రామంలో రోడ్డు పక్కన నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్రమ ఇసుకతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తుల మధ్య ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా మారడంతో అక్రమ ఇసుక రవాణా దందా బయటకు తెలిసింది. అక్రమ ఇసుక రవాణాతో అందరికి చెడ్డ పేరు వస్తుందని వారిలో వారే గుసగుసలాడుతున్నారు. ఇసుక మాఫియా జోరు తగ్గాలంటే అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.