Sunday, January 19, 2025

గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు.. జనం ఉక్కిరిబిక్కిరి

- Advertisement -
- Advertisement -

గాజాపట్టి అంతా ఇజ్రాయెల్ జల్లెడుపట్టి
భీకర వైమానిక దాడులు జనం ఉక్కిరిబిక్కిరి
భూతల యుద్థానికి ముందే నెత్తుటి శిథిలం
ఇప్పటికీ మొత్తం 7వేల మంది పౌరుల బలి
టెల్ అవీవ్‌కు చేరుకున్న ఫ్రాన్స్ నేత మెక్రాన్
రాఫా: గాజాపై ఇజ్రాయెల్ తన దాడులను మరింత ముమ్మరం చేసింది. హమాస్ స్థావరాలను ఎంచుకుని దాడులు జరిపింది. ఓ వైపు మంగళవారం హమాస్ దళాలు తమ చెరలోని మరో ఇద్దరు బందీలను విడిచిపెట్టాయి. గాజాపై గ్రౌండ్ అటాక్‌కు ముందు హమాస్‌ను అన్ని విధాలుగా కట్టడిచేసే దిశలో భాగంగా ఇజ్రాయెల్ సేనలు గాజా ఉక్కిరిబిక్కిరి అయ్యేలా దాడులకు దిగుతున్నాయి. ఇది సామాన్య పౌరుడికి మరింత ప్రాణాంతకం అవుతోంది. ఇప్పటి తీవ్రతర దాడులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీనితో ఘర్షణ మరింత విస్తరిస్తుందని, చివరికి అమెరికా సైనిక బలగాలపై కూడా దాడులకు అవకాశం ఉందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.

ఇద్దరు వృద్ధ మహిళలను గాజాలో హమాస్ మిలిటెంట్లు వదిలిపెట్టారు. వీరు ఇజ్రాయిలీలు, అయితే ఇప్పటికీ వందలాది మంది ఇజ్రాయెలీలు హమాస్ చెరలోనే ఉన్నారు. దాడుల తీవ్రత క్రమంలోనే పలు ప్రపంచ దేశాలు ఇరుపక్షాల నడుమ శాంతిస్థాపనకు రంగంలోకి దిగుతున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ మంగళవారం టెల్‌అవీవ్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ఉన్నతాధికారులతో చర్చించారు. హమాస్ దాడుల దశలో మృతి చెందిన ఫ్రెంచ్ పౌరులు, హమాస్ బందీలుగా మారిన వారి కుటుంబాలతో ఫ్రాన్స్ నేత మాట్లాడారు. ఇజ్రాయెల్‌తో సంఘీభావం వ్యక్తం చేసేందుకు తాను వచ్చినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షులు ఇసాక్ హెర్గోజ్‌తో మెక్రాన్ చెప్పారు. ఇజ్రాయెల్ బాధను తామూ పంచుకుంటున్నట్లు తెలిపారు.

రెండున్నర లక్షల మందికి తిండితిప్పలు
ఇప్పటి భీకర దాడులు వికటించిన నేపథ్యంలో గాజాలోని రెండున్నర లక్షల మంది వరకూ తిండి లేక, తాగేందుకు నీరు లేక, నిలిచేందుకు సరైన చోటు లేక అల్లాడుతున్నారు. ఆసుపత్రులలో వైద్య చికిత్సలకు అవసరం అయిన మందులు అయిపోవడంతో రోగుల బాధలు ఇనుమడిస్తున్నాయి. అతి కష్టం మీద ఇతర దేశాల నుంచి చివరికి ఐరాస సంస్థల నుంచి కొద్దిపాటి సహాయక సామాగ్రి గాజాలోని బాధిత ప్రాంతాలకు చేరుతోంది. అయితే అతి తక్కువ కోటా రావడంతో అత్యధిక సంఖ్యలో బాధితులు ఉండటంతో పరిస్థితి దారుణంగా మారింది.

ఇది ప్రజల మధ్య ఆహారం కోసం ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఏర్పడింది. గాజాస్ట్రిప్ ప్రాంతానికి ఇంధన నిల్వలు అందకుండా ఇజ్రాయెల్ సేనలు అడ్డుకుంటున్నాయి. గాజాలో తమ వాహనాలకు ఇంధనం అయిపోతూ ఉండటంతో సహాయక సామాగ్రిని సరఫరా చేసే పరిస్థితి లేకుండా పోతోందని ఐరాసకు చెందిన సహాయక సంస్థలు తెలిపాయి. ఆసుపత్రులలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడ్డ వారికి అవసరం అయిన ప్రాణరక్షక ఔషధాలు అందుబాటులో లేకపోవడం, ఆపరేషన్‌లకు, అత్యవసర చికిత్సలకు అవసరం అయిన విద్యుత్ సరఫరా లేకపోవడంతో వైద్య సిబ్బంది ఏమి చేయలేని స్థితిలో పడ్డారు.

మంగళవారం 400 వైమానిక దాడులు
మంగళవారం ఒక్కరోజే ఇజ్రాయెల్ ఏకంగా 400 వైమానిక దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ అధికారవర్గాలే నిర్థారించాయి. ఈ దాడులలో తాము పలువురు హమాస్ సైనిక దళాధిపతులను హతమార్చినట్లు, ఈ విధంగా ఈ దాడి తమకు అత్యంత కీలకమని టెల్ అవీవ్‌లో అధికారులు తెలిపారు. రాకెట్లను సంధించేందుకు సిద్ధంగా ఉన్న శత్రుపక్షాన్ని తాము దెబ్బతీస్తూ వస్తున్నామని వివరించారు. పలు చోట్ల కమాండ్ సెంటర్లను, హమాస్ టన్నెల్ ముఖద్వారాలను ఎంచుకుని వైమానిక దాడులు జరుగుతున్నాయి.

ఒక్కరోజు క్రితం ఇజ్రాయెల్ నుంచి 320 వైమానిక దాడులు జరిగినట్లు పాలస్తీనియా అధికారిక వార్తాసంస్థ వాఫా తెలిపింది. ఈ దాడులలో పలు నివాసిత భవనాలు దెబ్బతిన్నాయి. దక్షిణ ప్రాంతంలో పౌరులను తలదాచుకోవాలని ఇజ్రాయెల్ సేనలు ఆదేశాలు వెలువరించిన తరువాత జనం గుమికూడిన ప్రాంతాలను ఎంచుకుని దాడులకు దిగుతున్నారని హమాస్ వర్గాలు తెలిపాయి.

సఖాల్లా కుటుంబంలో 13 మంది బలి
రాఫా నగరంలో ఇజ్రాయెల్ దాడులలో సాధారణ పౌరుడు సఖాల్లా కుటుంబంలోని 13 మంది వైమానిక దాడులకు హతులయ్యారు. ఈ విషయాన్ని దాడులలో మిగిలిన కుటుంబం బంధువు అమ్మార్ అల్ భుట్టా తెలిపారు. దక్షిణ ప్రాంతం సురక్షితం అనుకుని తాము వచ్చామని, పైగా గాజాసిటీకి చెందిన వారిని ఇక్కడికి వెళ్లిపోవాలని తరిమికొట్టి పంపించిన తరువాత ఇజ్రాయెల్ తమను ఎంచుకుని మరీ దాడులకు దిగిందని స్థానికులు తెలిపారు. గాజాలో ఇప్పుడు ఏ ప్రాంతం కూడా పౌరులకు భద్రంగా లేదని ఆందోళన వ్యక్తం అవుతోంది. సోమవారం గాజా ప్రాంతంలో దట్టమైన పొదల మధ్య ఉండే ఇసుక సామూహిక ఖననవాటికలో కనీసం 33 మంది అంత్యక్రియలు దాడుల భయాల నేపథ్యంలో జరిగాయి.

ఈ పాలస్తీనియన్లలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది వ్యక్తుల ఛిద్రమైన భౌతికకాయాలు కూడా ఉన్నాయి. తమ కుటుంబం నామరూపాలు లేకుండా పోయిందని, అయితే చివరికి అంతిమఘట్టం నిర్వర్తించగలిగామని మిగిలిన ఒక వ్యక్తి తెలిపారు. అయితే తాము పౌరులను ఎంచుకుని దాడులకు దిగుతున్నామనే వార్తలు నిజం కాదని ఇజ్రాయెల్ తెలిపింది. నిజానికి సాధారణ పౌరులను హమాస్ బలగాలు తమ రక్షణ కవచంగా మల్చుకుని కవ్వింపు చర్యలకు దిగుతున్నాయని, ఈ క్రమంలో హమాస్‌ను ఎంచుకుని జరిపే దాడులలో పౌరులు మృతి చెందితే ఎవరు బాధ్యులని టెల్ అవీవ్‌వర్గాలు ప్రశ్నించాయి.

ఇప్పటికీ హమాస్ నుంచి 7 వేల రాకెట్లు ప్రయోగించారని ఇజ్రాయెల్ తెలిపింది. సాధారణ పౌరులను అడ్డుపెట్టుకుని వారు సాగిస్తున్న దాడులు అమానుషమని పేర్కొన్నారు. అయితే ప్రజలను ఏదో విధంగా ఒక్కచోటికి చేర్చి చివరికి ఆయా ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగుతోందని ఇదేం రివాజు అని పాలస్తీనియన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే తమ దాడులు తమ లక్షం నెరవేరే వరకూ సాగుతాయని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ తెలిపారు. పాలస్తీనియన్లు భద్రంగా ఉండాలనుకుంటే దక్షణ ప్రాంతానికి పారిపోవాలని కూడా సూచించారు.

ఇప్పటికీ 35 మంది ఐరాస సిబ్బంది మృతి
సహాయక చర్యల పర్యవేక్షణకు స్వయంగా వీటిలో పాల్గొనేందుకు వచ్చిన ఐరాస సిబ్బందికి చెందిన వారు 35 మంది వరకూ ఇప్పటి దాడులలో మృతి చెందారు. ఈ విషయాన్ని ఐరాస అధికారులు నిర్థారించారు. మంగళవారం ఒక్కరోజే తమ సిబ్బందిలోని ఆరుగురు దాడులలో చనిపోయినట్లు, వీరంతా పాలస్తీనియా శరణార్థుల కోసం పాటుపడుతున్నవారే అని వివరించారు. ఐరాస సహాయక సిబ్బంది శిబిరాలకు సమీపంలోనే బాంబులు పడుతున్నాయి.

మానవ చరిత్రలో మరో రక్తపాతం
5వేల మంది పాలస్తీనియన్లు…1400 మంది ఇజ్రాయెలీలు
ఇప్పటి ఘర్షణ అతి తక్కువ వ్యవధిలో అతి భారీ రక్తపాతానికి దారితీసింది. ఇజ్రాయెల్ దాడులలో ఇప్పటివరకూ 5వేల మందికి పైగా పాలస్తీనియన్లు బలి అయ్యారు. వీరిలో2000 మంది చిన్నారులు, దాదాపు 1100 మంది బాలలు ఉన్నారు. ఈ విషయాన్ని హమాస్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గత వారం వివాదాస్పద రీతిలో ఆసుపత్రిపై బాంబు దాడి ఘటనలో మృతులు కూడా ఈ మృతుల సంఖ్యలో ఉన్నారు. గడిచిన 24 గంటల్లో మరో 436 మంది మృతి చెందారని వివరించారు. కాగా ఇప్పటివరకూ ఘర్షణల క్రమంలో ఇజ్రాయెల్‌లో 1400 మంది వరకూ మృతి చెందారు. హమాస్ దుస్సాహసంలో ఎక్కువగా సాధారణ పౌరులు దెబ్బతిన్నారు. ఇప్పటికీ పలువురు హమాస్ బందీలుగా ఉన్నారు.

నేనైతే విముక్తి కానీ నా వారి గురించే బాధ
విడుదలైన బందీ వృద్ధ మహిళ లిఫ్షిజ్
పొమవారం రాత్రి హమాస్ మిలిటెంట్లు ఇద్దరు వృద్ధ మహిళలను చెర నుంచి విడిచిపెట్టారు. వీరిలో 85 సంవత్సరాల మహిళ యోచెవెడ్ లిఫ్షిజ్, 79 ఏండ్ల నురిత్ కూపర్ ఉన్నారు. వీరిని మిలిటెంట్లు ఈజిప్టు సమీపంలోనా రాఫా ముఖద్వారం వద్ద వదిలిపెట్టారు. వీరిని గాజా నుంచి బయటకు అంబులెన్స్‌లో తీసుకువెళ్లారు. ఈ దృశ్యాలు ఇప్పుడు ఈజిప్టు టీవీల్లో ప్రసారం అయ్యాయి. తమను గాజా సరిహద్దులలో కుటుంబంతో పాటు అపహరించుకువెళ్లారని ఈ మహిళలు తెలిపారు.

తమను విడిచిపెట్టినందుకు ఆనందంగా ఉందని, అయితే ఇప్పటికీ వందలాది మంది హమాస్ బందీలుగా ఉన్నారని, చివరికి తన భర్త కూడా వారి వద్దనే ఉన్నాడని, వీరి పరిస్థితి తమకు బాధాకరం అని వృద్ధ మహిళలు తెలిపారు. టెల్ అవీవ్‌లోని ఇచిలోవ్ ఆసుపత్రికి విడుదల అయిన ఇద్దరు వృద్థులను అక్కడి ఆసుపత్రి సిబ్బంది వీల్ ఛెయిర్‌లో లోపలికి తీసుకువెళ్లింది. అక్కడున్న సైనికులు తలవంచి వీరికి వందనం చేశారు. కొందరు వీరిని ముద్దాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News