కారేపల్లి : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండల వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. మంగళవారం ఉదయం నుండి కారు మబ్బులు కమ్మి, చిమ్మ చీకటిని తలపిస్తూ ఒక్కసారిగా మొదలయి క్రమక్రమంగా భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఎక్కడ ఏ చెట్టు కొమ్మలు విరిగిపడతాయోనని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటు తమ ప్రయాణం కొనసాగించారు. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
గంటసేపు వర్షం ఆగకుండా కురియడంతో, ప్రయాణిస్తున్న వాహనదారులు, చేలలో పనిచేసుకుంటున్న రైతులు, కూలీలు వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడ్డారు. మేతకు వెళ్లిన మూగజీవాలైన పశువులు, మేకలు సైతం వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ ఇంటి దారి పట్టాయి. కాగా గత వారం రోజులుగా మండల వ్యాప్తంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ఎండ వేడిమి భరించలేక ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలు వాతావరణం కాస్త చల్లబడటంతో కాస్త హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.