Tuesday, November 5, 2024

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక

Heavy rain alert to Telangana
మనతెలంగాణ/హైదరాబాద్:  రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని ఇది రానున్న ఆరు గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్ పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తుఫానుతో అప్రమత్తంగా ఉండాలి
తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై
ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 470 కి.మీ. దూరంలో తూర్పు – ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి 540 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో విశాఖపట్నం , గోపాల్‌పూర్ మధ్యలోని కళింగపట్నం వద్ద నేడు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 27 తేదీన ఈశాన్య- తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు ప్రకటించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి ఈనెల 29న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News