Friday, December 20, 2024

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః హైదరాబాద్ రెండు రోజుల నుంచి భారీ వర్షం పడుతుండడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. నగరమంతా ఎడతెరపలి లేకుండా వర్షంపడుతోంది. బుధవారం సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన వర్షం ఒక్కనిమిషం కూడా తెరపి లేకుండా కురుస్తోంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. టోలీచౌకిలోని పారామౌంట్ కాలనీలో భారీగా నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం కలగడంతో అంధకారమయం అయింది.

నగరంలోని శిథిలావస్థలో ఉన్న పలు ఇళ్లలో ఉంటున్న వారిని జిహెచ్‌ఎంసి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కవాడిగూడలోని ఓ పాత ఇల్లు కూలడంతో అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి ఇళ్లను గుర్తించేందుకు జిహెచ్‌ఎంసి సిబ్బంది నగరాని జల్లెడపడుతున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 426 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రావాలని లేకుంటే ఇళ్లల్లోని ఉండాలని కోరారు. జిహెచ్‌ఎంసి పరిధిలో సాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 9000113667ను ఏర్పాటు చేశారు. సాయం కావాల్సిన వారు వెంటనే ఈ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

అత్యధిక వర్షపాతం…
హైదరాబాద్ నగరంలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో వర్షపాతం గణనీయంగా పెరిగింది. సాధారణంగా జులై 20వ తేదీ నాటికి హైదరాబాద్ నగరంలో సగటున 101.2 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ ఏడాది ఈ సమయం నాటికి సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 122.4 మి. మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని సూచించారు. గచ్చిబౌలిలో ఉదయం అరగంట సమయంలోనే 13మి.మీ వర్షపాతం నమోదైంది, మియాపూర్‌లో 12.5 మి.మీ, జీడిమెట్లలో 11.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ రాత్రికి కూడా నగర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

విధుల్లో నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలుః రోనాల్డ్ రాస్, జిహెచ్‌ఎంసి కమిషనర్
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో, జిహెచ్‌ఎంసి సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ హెచ్చరించారు. తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇంజనీర్లు హాజరయ్యారు. వాటర్‌లాగింగ్, చెట్లు విరిగిపోయాయని వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. విరిగిపడిన చెట్లను డిఆర్‌ఎఫ్ బృందాలు తొలగిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News