Saturday, November 23, 2024

కేరళలో భారీ వర్షం..పాఠశాలల మూసివేత

- Advertisement -
- Advertisement -

కొచ్చి: కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేల కూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా ఎర్నాకులం, కన్నూర్, ఇడుక్కి, త్రిసూర్, కొట్టాయం, కాసరగోడ్ సహా ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. మంగళవారం ఒక్క రోజే ఇడుక్కి జిల్లా పీర్మాడే లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రం లోని పరిస్థితిని సమీక్షించేందుకు రెవెన్యూ మంత్రి రాజన్ జిల్లా కలెక్టర్లతో , రెవెన్యూ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కొల్లాం, అలప్పుజా, త్రిసూర్, కొట్టాయం, ఎర్నాకులం తదితర జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి.

కొల్లాంషెంకోట్టై మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంబా నది నీటిమట్టం పెరగడంతో పతనంతిట్ట జిల్లా కురుంబన్‌ముజిలో గిరిజన కాలనీకి చెందిన వందలాది కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి. మీనాచిల్ నది పొంగి ప్రవహిస్తుండడంతో కొట్టాయం జిల్లా లోని పలు ప్రాం తాల నివాసులు ఇబ్బందుల పాలవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున హై రేంజ్ రోడ్లపై అనవసర ప్రయాణాన్ని విరమించుకోవాలని , బీచ్‌లు, నదుల వద్దకు వెళ్లవద్దని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News