మునిగిన లోతట్టు ప్రాంతాలు
రోడ్లన్నీ జలమయం.. నిలిచిపోయిన ట్రాఫిక్
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం దంచి కొట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగరంలోని ప్రధాన రహదారులు వరద కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. వరద నీరు ఇంట్లోకి రావడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా మధ్యాహ్నానికి వాతావరణం మారిపోయింది. సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్ , ఆబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డికాపూల్, హియయత్ నగర్, ట్యాంక్‌బండ్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి లక్డీకాపూల్‌లో వివిధ దుకాణాల్లోకి భారీగా నీరు చేరింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 88.8 మిల్లీమీటర్ల..
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 88.8 మిల్లీమీటర్లు, హైదరాబాద్‌లో 70, సిద్ధిపేటలో 73.5, సంగారెడ్డిలో 63, రంగారెడ్డిలో 53, మెదక్‌లో 50, జగిత్యాలలో 46, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.