Monday, December 23, 2024

తడిసిముద్దయిన ప్రజలు

- Advertisement -
- Advertisement -

Heavy rain in many districts across Telangana

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో జోరు వాన

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. పలుచోట్ల కురిసిన వర్షానికి ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. నగరంలోని అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టగా, ట్యాంక్‌బండ్, కూకట్‌పల్లి, కెపిహెచ్‌బీ, హైదర్‌నగర్, ఆల్వీన్‌కాలనీ, మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేట ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరద నీరు రహదారులపైకి పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

రాగల మూడురోజులు తేలికపాటి…
రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర వారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి ఉన్న తూర్పు-పశ్చిమ ద్రోణి శనివారం బలహీన పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం స్థిరంగా కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 5.8కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో ఈశాన్య దాని పరిసరాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా…
శనివారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 56 మిల్లీమీటర్లు, నాగర్‌కర్నూల్‌లో 48, నల్లగొండలో 28, మేడ్చల్ మల్కాజిగిరిలో 28, వనపర్తిలో 25, జోగులాంభ గద్వాల్‌లో 20, నారాయణపేటలో 19, మహబూబ్‌నగర్‌లో 19, హైదరాబాద్‌లో 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News