స్తంభించిన ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు అంతరాయం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు కురవగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కురిసింది. ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా కవాడిగూడ, గాంధీనగర్, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, విద్యానగర్‌లో ఓ మోస్తరు వర్షం పడింది. వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరడంతో వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసి సిబ్బందిని అధికారులు అందుబాటులో ఉంచారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు నైరుతిదిశ నుంచి రాష్ట్రంలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, ఈ నేపథ్యంలో తూర్పు తెలంగాణ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 42 మిల్లీమీటర్ల వర్షపాతం
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 31.3, కరీంనగర్‌లో 27.3, రాజన్న సిరిసిల్లలో 26, కుమురం భీం ఆసిఫాబాద్ 20.3, రంగారెడ్డిలో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
Heavy rain in many parts of Hyderabad