తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
భారత వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్: ఎండలతో అట్టుడుకుతున్న పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) చల్లటి కబురు చెప్పింది. రానున్న ఐదురోజుల్లో భారతదేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలతో పాటు, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఏర్పడ్డ సైక్లోన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఈ సందర్భంగా ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎండలతో అట్టుడికిన రాజస్థాన్‌లో సైతం ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గగా అక్కడ కూడా రానున్న రోజుల్లో వానలు పడతాయని, కేరళ, త్రిపుర, మేఘాలయల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది మొదటి నైరుతి రుతుపవనాలు ఈ నెల 27వ తేదీన కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని, సాధారణంగా రుతుపవనాలు ప్రవేశించే గడువు కంటే ఈసారి ఐదు రోజులు ముందుగానే వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.