Monday, January 20, 2025

అమెరికా ఎడారి బురదమయం..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలోని నార్తర్న్ నెవాడా ఎడారి ప్రాంతం భారీ వర్షాల తాకిడితో పూర్తిగా అడుగుల మేర బురదతో నిండిపోయింది. ఏటా ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ మొదటివారం వరకూ ఇక్కడ జరిగే బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ రసాభాసగా మారింది. ఆదివారం ఈ ప్రాంతం నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో దాదాపు 70,000 మంది వరకూ చిక్కుపడ్డారు. కొందరు భారీ వర్షాలు, బురదలో కూరుకుపోయిన ఘటనలతో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అధికారులు వీటిని ధృవీకరించలేదు. పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టి తరువాత మృతులు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా గాయాలు అయ్యాయా? అనే విషయాలను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. హరికేన్ తుపాన్ తాకిడితో ఎడారిలో కుండపోత వానలతో అంతటా నడుం లోతు వరకూ బురద నిండుకుంది. దీనితో ఇక్కడికికి వచ్చిన ఉత్సవ సందర్శకులు బూటుకాలు తీసి వేయలేని పరిస్థితి ఏర్పడింది.

వాహనాలు కూడా నడపలేని స్థితి ఏర్పడింది. బురద దానంతట అదే తొలిగిపోయే వరకూ ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడనే ఉండాల్సిందేనని వెల్లడైంది. పూర్తిగా ఈ నేల జారుడుగా మారడం గందరగోళానికి దారితీసింది. ఇక్కడ దాదాపు లక్ష మంది వరకూ చిక్కుపడ్డారని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రాంతంలోని కౌంటీ షరీఫ్ ఆఫీసు కూడా బురదలో కూరుకుపోయింది. యాత్రికులు సురక్షితమైన ప్రాంతాలు చూసుకుని ఉండాలని, అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. రెండు మూడు నెలల్లో కురిసే వర్షాలు ఒకేసారి పడ్డాయని వెల్లడైంది. ఫెస్టివల్ జరిగే ఇక్కడి బ్లాక్‌రాక్ సిటీని పూర్తిగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. కాగా దిగ్బంధనంలో ఉండలేక కొందరు కాలినడకన సాగుతూ అతి కష్టం మీద ఈ ప్రాంతం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడైంది.

అమెరికాలో అక్కడక్కడ ఉండే బర్నర్స్ తెగ వారు తమ అస్థిత్వాన్ని చాటుకోవడానికి ఏడాదికోసారి ఈ బ్లాక్‌రాక్ సిటీ ప్రాంతానికి వస్తారు. ఈ క్రమంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ బర్నర్స్ సొంతంగా ఓ కళాత్మక వ్యూహాత్మక ప్రాంతాన్ని సృష్టించుకుని ఏటా ఇక్కడికి వస్తుంటారు. పలువురు కళాకారులు కూడా వస్తూ ఉండటంతో షోలు, సందర్శకుల తాకిడితో ఈ ప్రాంతం విలసిల్లుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News