కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు,
హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
వాతావరణ శాఖ హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: ఉత్తర, దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలోనే రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, నాగర్‌కర్నూల్, గద్వాల్, నారాయణపేట, సూర్యాపేట్, మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. దీంతోపాటు రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.