పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
స్తంభించిన జనజీవనం
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ట్రాఫిక్ జాంతో వాహనదారులకు అవస్థలు
శనివారం హైదరాబాద్‌లో 110, మేడ్చల్ మల్కాజిగిరిలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు జిహెచ్‌ఎంసి పరిధిలో రెండోరోజూ కూడా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి నగర ప్రజలు తేరుకునేలోపే శనివారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం ఉదయం నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఈ నేపథ్యంలోనే పనినిమిత్తం ఆఫీసులకు, ఇతర పనుల నిమిత్తం బయటకువచ్చిన ప్రజలు భారీ వర్షానికి రోడ్లపై చిక్కుకు పోయారు. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో సాయం కోసం జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూం నెంబర్ 040 2111 1111ను ఏర్పాటు చేసింది. చాలాచోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
సరూర్‌నగర్‌లోని 18 కాలనీలు జలదిగ్భంధంలో….
ప్రస్తుతం సరూర్‌నగర్‌లోని 18 కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాటు హయత్‌నగర్ టు తొర్రూర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. చంపాపేట్, బాలాపూర్‌లో పలు కాలనీలు నీట మునగ్గా, తుర్కయాంజల్ మున్సిపాలిటీల్లో సుమారు 950 కుటుంబాలు వరద నీటిలో మునిగాయని, హయత్‌నగర్ శివారులోని బంజారా కాలనీ, వెంకటరమణ, బ్రాహ్మణపల్లి తదితర కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిందని అధికారులు తెలిపారు.
రహదారికి ఇరువైపులా 3 కి.మీ మేర వాహనాలు
రాత్రి కురిసిన వర్షానికి చంపాపేట, చందానగర్, చాంద్రాయణగుట్ట, జిల్లెలగూడ, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, సరూర్‌నగర్, హయత్‌నగర్ పరిధిలోని చాలా వరకు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వరద చుట్టుముట్టింది. శనివారం కూడా భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. జిల్లెలగూడ బాలాజీనగర్ కాలనీలో ఇళ్లలోకి మురికి నీరు చేరింది. ఆ ప్రాంతంలో డ్రైనేజీ పనులు జరుగుతుండటం వల్ల భారీ వర్షానికి మురికికాల్వలు పొంగిపొర్లి రహదారులతో పాటు ఇళ్లలోకి నీరు చేరింది. భారీ వర్షానికి హైదరాబాద్- టు బెంగళూరు రహదారిపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. పక్కనే నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ కావడంతో వరదనీటిలో చిక్కుకుంది. దీంతో హైదరాబాద్- టు బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రహదారికి ఇరువైపులా 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. అరాంఘర్ టు శంషాబాద్ రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం
అబ్దుల్లాపూర్ మెట్‌లో వాగులు పొంగిపొర్లడంతో లష్కర్ గూడ, అనాజ్ పూర్, మజీద్పూర్, గుంతపల్లి, బాటసింగారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి లోపల గ్రామాలకు వెళుతున్న సందర్భంలో వాగు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఆగిపోయింది.
పిడుగుపాటుకు 73 గొర్రె పిల్లలు దుర్మరణం
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్ర సముద్రం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడిన ఘటనలో 73 గొర్రె పిల్లలు మృతి చెందాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో రుద్ర సముద్రం గ్రామ శివారులో గొర్రెల మందపై పిడుగు పడింది. దీంతో మందలో ఉన్న దాదాపు మొత్తం 73 గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా బీమ్‌పూర్ మండలం పిప్పల్‌కోటిలో పిడుగుపాటుకు ఎద్దు దుర్మరణం చెందగా జైనథ్ మండలం సాంగ్వికేలో పిడుగుపాటు పదిహేను మేకలు దుర్మరణం చెందాయి.
ముగ్గురి దుర్మరణం
పిడుగుపాటుకు ఆదిలాబాద్ జిల్లా బజార్‌హథ్నూర్ మండలంలోని బుర్కపల్లి గ్రామానికి చెందిన బనియ గరన్‌సింగ్ (45) మృత్యువాత పడగా, అతని తమ్ముడి భార్య బనియా ఆశాభాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా ఆమె దుర్మరణం చెందింది. వర్షం పడినప్పుడు చెట్టుకింద నిల్చున్నప్పుడు పిడుగుపాటు పడడంతో వారిద్దరూ మృత్యువాత పడ్డారు. ఇదే జిల్లా బండల్ నాగపూర్‌లో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వెంకటేశ్వర నగర్‌లో కూలిన గోడ
కూకట్‌పల్లి సర్కిల్ వివేకానంద నగర్ డివిజన్‌లోని వెంకటేశ్వర నగర్‌లో శనివారం ఓ ఇంటిపై పిడుగుపడడంతో ఇంటి గోడ కూలింది. ఇంట్లోని పలు ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఇంటి సామగ్రి దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
రాగల 48 గంటల్లో అల్పపీడనం
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కిందిస్థాయి నుంచి గాలులు ఉత్తర, వాయువ్య దిశల నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఈ అల్పపీడనం నాలుగైదు రోజుల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనికి జావద్ తుఫానుగా నామకరణం చేశారు.
రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు విరమించే….
ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు శనివారం వాయువ్య ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని భాగాల నుంచి విరమించాయని అధికారులు స్పష్టం చేశారు. రాగల రెండు మూడు రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌ఘఢ్, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశాలతో పాటు మరికొన్ని భాగాల నుంచి నైరుతి రుతుపవనాలు విరమించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది.
శనివారం నమోదైన వర్షపాతం వివరాలు
శనివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 110, మేడ్చల్ మల్కాజిగిరిలో 90, రంగారెడ్డిలో 82, ఆదిలాబాద్‌లో 52, ములుగులో 45, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 48, నిర్మల్‌లో 45, సిద్ధిపేటలో 38, యాదాద్రి భువనగిరిలో 35, నల్లగొండలో 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.