అతలాకుతలం అయిన నగరం
పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
రాకపోకలు స్తంభించిన విజయవాడ జాతీయ రహదారి
చంపాపేట్ నాలాలో వ్యక్తి గల్లంతు
హైదరాబాద్: కుండపోత, కుంభవృష్టి నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షం నేపథ్యంలో చంపాపేట్ నాలాలో ఓ వ్యక్తి గల్లంతుకాగా, ఆ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాములుగా 3 సెంటిమీటర్ల వర్షానికే అతలాకుతలం అయ్యే నగరంలో ప్రస్తుతం 11 సెంటిమీటర్ల వర్షపాతం సరూర్‌నగర్ ప్రాంతంలో నమోదు కావడంతో ఆ ప్రాంత ప్రజలు అతలాకుతలం అయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో కుండపోత వర్షం కురవడంతో మెయిన్‌రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మేయర్ అప్రమత్తం చేశారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ 040 2111 1111ను ఏర్పాటుచేశారు. తక్షణమే డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దించారు.
మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి జిల్లాలో అధికం
మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి జిల్లాలో అధికంగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్ర కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వాహనదారులు తమ పనులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఒక్కసారిగా వర్షం కురవడంతో వారు ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. మరో మూడు రోజుల పాటు పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సరూర్‌నగర్‌లో అత్యధికంగా 113 మిల్లీమీటర్లు
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ అత్యధికంగా 113 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగాహైదరాబాద్‌లోని సైదాబాద్‌లో 103 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. వీటితో పాటు జనగాం జిల్లాలో 95, నాగర్‌కర్నూల్‌లో 88, యాదాద్రి భువనగిరిలో 62, కామారెడ్డిలో 45, మహబూబ్‌నగర్‌లో 45, భద్రాద్రి కొత్తగూడెంలో 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.