Sunday, January 12, 2025

కుండపోత

- Advertisement -
- Advertisement -

3 children died after drowned in pit in shadnagar

అరగంటలో 6 సెం.మీ. వర్షపాతం
నీట మునిగిన వందలాది కాలనీలు
వణికిన మూసీ పరివాహక జనం
పలుచోట్ల నేలకూలిన చెట్లు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మరో మూడు రోజులు భారీ వర్షాలు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం కుదిపేసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా సాయంత్రానికి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి వర్షం కురిసింది. కుండ పోత వర్షంతో విశ్వనగరం జలదిగ్బంధమైంది. మెట్రో రైలు వంతెనలు పలు చోట్ల జలపాతాలను తలపించాయి. అంతేకాకుండా వర్షం ధాటికి కాలనీలు, రోడ్లలన్నీ పూర్తిగా కుంటలుగా మారాయి. సాయంత్రం 5 గంటలకు మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కొనసాగింది. మరికొన్ని ప్రాంతాల్లో కేవలం అరగంటలోపే 5సెం.మీ. వర్షం కురవడంతో ఆయా ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో వందలాది కాలనీలు నీట మునగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లు, అపార్టుమెంట్ల సెల్లార్‌లోకి వర్షపు నీరు చేరడంతో పూర్తిగా జలమయమయ్యాయి. మూసీ, చెరువులు, కుంటల పరిసర ప్రాంతాలోని కాలనీవాసులు వర్షం కురడంతో వణికిపోయారు. భారీ వర్షం వల్ల పలుచోట్ల వృక్షాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరా యం ఏర్పడి కొన్ని కాలనీల్లో అంధకారం నెలకొంది. పలు సర్కిళ్ల పరిధిలో గంట వ్య వధిలోనే 7 నుంచి 9 సెం.మీలకు పైగా వర్షం కురిసింది.
కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
భారీ వర్షం కురవడంతో వరద నీటికి తోడు డ్రైనేజీలన్నీ పొంగిపొర్లడంతో నగర వ్యాప్తంగా రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకునిపోయారు. దీంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ముందుకు కదలే పరిస్థితి లేకపోవడంతో మహిళా ఉద్యోగులు బస్సుల్లో రెండు నుంచి మూడు గంటల పాటు నరకయాతన పడ్డారు.
పలు ప్రాంతాల్లో 9సె.మిపైగా వర్షం
నాంపల్లి 9.2, ఎల్‌బిస్టేడియం 8.7, మెహిదీపట్నం 8.4, ఖైరతాబాద్ 7.6, సరూర్‌నగర్ 7.3, అత్తాపూర్ 6.5, అంబర్‌పేట్ 6.4, మలక్‌పేట్ 6.2, ఆసిఫ్‌నగర్ 5.3 సె.మి.వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి, మూసాపేట్, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్‌రోడ్, ముషీరాబాద్, రాంనగర్, ఓయు చిలకలగూడా సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, కుషాయిగూడ, చిలకనగర్, నాగోల్ కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్, చాదర్‌ఘాట్ కోఠి ప్రాంతాల్లో సైతం 1 నుంచి 5 సె.మి.లోపు వర్షం కురిసింది. మూసీకి వరద నీరు పోటెత్తడంతో అంబర్‌పేట మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరింది. ఖైరతాబాద్ పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ జామ్ భారీగా అయ్యింది. నాంపల్లిలో అత్యధికంగా 9.2 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో ఆకస్మికంగా భారీ వర్షం కురవడంతో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. భారీ వర్షం కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కల్గిన వెంటనే జిహెచ్‌ఎంసి హెల్ప్ సెంటర్ 040-21111111 నంబర్‌కు కాల్ చేయాల్సిందిగా నగరవాసులకు సూచించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లలు మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు తక్షణ సహాయ చర్యలను అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మేయర్ అదేశించారు.

Heavy Rain Several Parts in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News