Wednesday, November 6, 2024

మరో రెండు రోజులు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు వడగండ్లు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండి) వెల్లడించింది. సోమవారం నాడు దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఐఎండి ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర భారతదేశంలో ఈనెల 2,3తేదిలలో అరుణాచల ప్రదేశ్ , అస్సాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ,కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఉత్తరాఖండ్ ,హర్యానా, చండిగడ్ , ఢిల్లీ ,పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ భారత దేశంలో రాయలసీమ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కర్ణాటక , కోస్తాంధ్రప్రదేశ్ , కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
తెలంగాణలో వడగండ్ల వాన!
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులతో గంటకు 40నుంచి 50కిలోమీటర్లవేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ ,ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకూ సగటు సముద్రమట్టం నుంచి 1.5కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతోందని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణతోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు , మెరుపులు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రానున్న 24గంటల్లో తెలంగాణలోని అదిలాబాద్ , కొమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం , నల్లగొండ, జగిత్యాల, జనగామ , సిద్దిపేట, యాదాద్రి భువనగిరి ,రంగారెడ్డి, హైదారబాద్ , మేడ్చెల్, మల్కాజిగిరి ,వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ,కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు

,మెరుపులు వండగండ్లతో కూడిన భారీ వర్షాలు వడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గంటకు 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలలో ఉరుములు, మెరుపులు ,బలమైన ఈదురు గాలులతో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం కూడా ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలతో పాటుగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాల్లో ఉరుములు , మెరుపులు వండగండ్లతోకూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చిరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆతరువాత మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ కొనసాగిస్తూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ బులిటిన్ విడుదల చేసింది.
పాలకుర్తిలో భారీ వర్షం
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జనగాం జిల్లా పాలకుర్తిలో అత్యధికంగా 124.6మి.మి వర్షం కురిసింది. దేవరుప్పల్‌లో 122.8 మి.మి వర్షం కురిసింది.మిగిలిన ప్రాంతాల్లో వెలగటూరులో 93.8, ధర్మాసాగర్‌లో 92.4, జఫార్‌గడ్‌లో 87.8, కరీంనగర్‌లో 96.2, భోన్‌గిర్‌లో 83, షేక్‌పేట్‌లో 82, నాగిరెడ్డిపల్లిలో 82, అంబర్‌పేట్‌లో 79.2, రఘునాధపాలెంలో 77, సుల్తానాబాద్‌లో 75.2 పరకాల్‌లో 74.6, బెల్లంపల్లిలో 71.4, కొణిజర్లలో 70.4, శాయంపేటలో 69.6, జనగాంలో 68.8, భూపలపల్లిలో 68.2, కొల్లాపూర్‌లో 66.8, మక్లూర్‌లో 66.8, హైదరాబాద్‌లో 66.7, సరూర్‌నగర్‌లో 66.2, చందుర్తిలో 66, భువనగిరిలో 65.4 రామగుండంలో 64, అశ్వారావుపేటలో 62.4, మధిరలో 61, ఎల్లారెడ్డిలో 60.2, పెద్దపల్లిలో 58.6, కామారెడ్డిలో 57.4, మేడ్చెల్‌లో 49, యాదగిరిగుట్టలో 45.2, ఖమ్మంలో 43.2, వరంగల్‌లో 40.5 మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి పదును వానలు పడ్డాయి.
అకాల వర్షాలతో పొంగిన మూసి..భారీగా పంటనష్టాలు
రాష్ట్రమంతటా కురుస్తున్న అకాల వర్షాలతో మూసినదికి వరదనీటి ఉధృతి పెరిగింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రుద్రవెళ్లి, వలిగొండ, సంగెం బీమా లింగకత్వ వద్ద మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మోత్కురు మండల పరిధిలో బికేరు వరదనీటితో పరవళ్లుతొక్కుతొంది. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోతకొచ్చిన పంటచేలతోపాటు కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం , మార్కెట్ యార్డుల్లో విక్రయం కోసం ఉంచిన ధాన్యపు రాసులు తడిచి ముద్దవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కురిసిన భారీ వర్షాలు ,వడగండ్లు , ఈదురుగాలతో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దపల్లి జిల్లా బోజన్న పేటలో ఐకేపి కేంద్రంలోని ధాన్యం నీటమునిగింది. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి ,

మొక్కజొన్న పైర్లు దెబ్బతిన్నాయి.మామిడి కాపు నేలరాలింది. గద్వాల జిల్లాలో గట్టు మండల పరిధిలోని చిన్నొని పల్లి గ్రామంలో 101ప్యాకేజి పనులు పూర్తి కాకపోవటంతో రిజర్వాయర్‌లోకి నీరు చేరుకుంటోంది. చిన్నొనిపల్లిలోకి నీరు చేరి రెడ్‌జోన్‌లోకి చేరుకుంటోంది. గద్వాల , ధరూర్, మల్దకల్, తదితర మండలాల్లో మొక్కజొన్న వరి పంటలు దెబ్బతిన్నాయి.మామిడి కాపు నేలరాలి రైతులు భోరున విలపిస్తున్నారు. వికారబాద్ జిల్లాలో పరిగి , దౌల్తాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చేతికొచ్చిన వరి ,మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.సంగారెడ్డి జిల్లాలో వడగండ్లవానకు వరి ,మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.

మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. అదిలాబాద్ జిల్లాలో సిరికొండతోపాటు పలు ప్రాంతాల్లో గాలివాన భీభత్సం సృష్టించింది. చెట్లు నేలకొరిగాయి.ఇల్లపై రేకులు ఎగిరిపోయాయి.విద్యుత్ స్తంబాలు ఒరిగిపోయాయి. మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.హన్మకొండ జిల్లాలో భీమదేవర పల్లితోపాటు పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News