న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గడ్చిరౌలి లోని 130 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు నాందేడ్, హింగోలి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో ఐదు రోజుల పాటు దేశ మధ్య పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, గోవా, మహారాష్ట్రలోని మరఠ్వాడ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొంది.
హర్యాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో పిడుగుల కారణంగా ఐదుగురు చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులూ, చంబా జిల్లాలో మెరుపు వరదలు వచ్చాయి. అయితే ప్రాణనష్టం జరగలేదు. అస్సాంలో వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఆ రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదస్థాయికి దిగువనే ప్రవహిస్తున్నాయి. ఇక్కడ వరదల కారణంగా 6,27,874 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది.