Sunday, December 22, 2024

జలదిగ్బంధంలోనే దుబాయ్

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ పర్యాటక కేంద్రం దుబాయ్‌లో కుండపోత వానలు,పెనుగాలులతో విషమ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం నాటి భారీ వర్షాలతో దుబాయ్ అంతా నీటమునిగింది. రాదార్లు జలమయం కావడంతో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పలు ప్రముఖ దేశాలకు వెళ్లేందుకు కేంద్ర బిందువుగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుల తరబడి పలు విమానాలు రద్దు అయ్యాయి. దీనితో ఈ పర్యాటక భూతలస్వర్గం విలవిలలాడుతోంది. ఇప్పటికీ పలు వీధులలో నీటి ప్రవాహాలు సుడులు తిరుగున్నాయి. ఈ క్రమంలో విమానాలు, వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణకు అధికార యంత్రాంగం తలమునకలయింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు దుబాయ్‌లో చిక్కుపడటం, కమ్యూనికేషన్స్ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో పరిస్థితి దిగజారింది. ఇటీవలే యునైటెడ్ అరబ్ ఏమిరైట్స్‌లో రికార్డు స్థాయి భారీ వర్షం కురిసింది. 75 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంతగా వర్షపాతం రికార్డుఅయింది.

యుఎఇలో పలు ప్రాంతాలలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల షాపింగ్ మాల్స్ పై కప్పుల నుంచి నీరు పడుతోంది. మాల్స్ నీటమునిగాయి. దుబాయ్‌లో పలు లేన్లతో కూడిన ఓ హైవేలో రాకపోకలకు కేవలం ఒకే మార్గాన్ని తెరిచి ఉంచాల్సి వచ్చింది. దీనితో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. దుబాయ్‌ను అబూధాబితో కలిపే ప్రధాన రోడ్డు జలమయం కావడంతో ఇక్కడినుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పెట్రోలు స్టేషన్‌ల వద్ద భారీగా జనం గుమికూడారు. స్టాక్‌లు అయిపోతూ ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. దుబాయ్ ఎయిర్‌పోర్టు పూర్తిగా నీటమునిగింది. రన్‌వేలపై విమానాలు నిలిచిపొయ్యాయి. గురువారం దూర ప్రాంతాల నుంచి వచ్చే విమానాలను టర్మినల్ 1 వద్దకు అనుమతించారు. అయితే చాలా ఆలస్యంగా రాకపోకలు సాగుతున్నాయి. ఇక విమానాశ్రయంలోనే నిలిచిపోవల్సి వచ్చిన ప్రయాణికులకు ఎమిరైట్స్ విమానయాన సంస్థ సరైన ఏర్పాట్లు చేయలేకపోతోంది.

సమీపంలోని రోడ్లు అని జలమయం అయి ఉండటంతో ప్రయాణికులకు అవసరం అయిన ఆహారం అందించడం కష్టం అవుతోంది. కాగా దుబాయ్‌లో తుపాన్ భారీ వర్షం సమయంలో ఆకాశం నీలం రంగు నుంచి ముదురు ఆకుపచ్చ రంగులోకి జారుకున్నప్పటి దృశ్యాలతో కూడిన వీడియోను ఓ నెటిజన్ వెలువరించారు. దుబాయ్ దుమ్ముపట్టింది. ఆకాశం పచ్చబడిందనే స్పందనలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News