సిమ్లా : భారీ వర్షాలతో పర్యాటక కేంద్రం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో జనజీవితం అస్థవ్యస్థం అయింది. ఈ పర్వత రాష్ట్రంలో కుండపోత వానల నడుమ కొండచరియలు విరిగిపడటంతో మనాలీ చండీగఢ్ హైవేపే గంటల తరబడి 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ రహదారి అంతా ఇప్పుడు వాహనాలు నిలిచిపోవడంతో జాతరగా మారింది. ఎతైన కొండ ప్రాంతాల మీదుగా సాగే ఈ హైవే ఇప్పుడు దిగ్బంధం చెందింది. గత రాత్రి నుంచి కుండపోత వానలు , తరువాతి క్రమంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతూ ఉండటంతో వాహనాలు ముందుకు సాగలేక వెనుకక వెళ్లలేక ప్రయాణికులు భారీ వర్షాల నడుమనే గడపాల్సి వచ్చింది. సోమవారం దాదాపు 11 కిలోమీటర్ల పొడవునా దాదాపు వేయి మంది వరకూ చిక్కుపడ్డారు.
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం ఈ హిమాలయ శ్రేణువుల్లో విపరీత సాధారణ ఘట్టం . భారీ వర్షాలతో అనేక మంది రాత్రంతా తమ వాహనాల్లోనే జాగరణ చేయాల్సి వచ్చింది. పర్యాటక కేంద్రాల్లోని పలు హోటళ్లు, అతిధి గృహాలు అన్ని కూడా కిక్కిరిసినట్లు తెలిసింది. దూర ప్రాంతాల నుంచి పర్యాటకులుగా వచ్చిన వారికి ఇప్పుడు ఈ పర్యటన చావుబతుకుల మధ్య చెలగాటంగా మారింది. పలువురు ప్రయాణికులు నిర్ణీత సమయానికి తమ విమానప్రయాణాలకు వీలుగా విమానాశ్రయాలు చేరుకో లేకపొయ్యారు. పలు ప్రాంతాల్లో విరిగి పడ్డ పెద్దపెద్ద కొండరాళ్లను తీసివేసేందుకు ఇప్పుడు సహాయక సిబ్బంది పేలుడు పదార్థాలను వాడాల్సి వస్తోంది.
ప్రయాణికులు అంతా తమ తమ దిగ్బంద ప్రాంతాల్లోనే ఉండాలని, రోడ్ల పునరుద్ధరణ జరిగే వరకూ ఇతర చోట్లకు వెళ్లరాదని అధికారులు తెలిపారు. తాము ఆదివారం సాయంత్రం నుంచి మధ్యలో చిక్కుపడ్డామని, దిక్కుతోచనిస్థితి ఏర్పడిందని హర్యానా నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు వాపోతున్నారు.