భారీ వర్షానికి భాగ్యనగరం విలవిలలాడింది. అరగంటకు పైగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయ్యింది. రహదారులు వరదకాలువలుగా మారాయి. రాజధాని పూర్తిగా చెరువును తలపించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో నగరంలోని ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయ్యింది. దీంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి,మాదాపూర్,మియాపూర్,చందానగర్,షేక్‌పేట్,మెహిదీపట్నం,ఫిలింనగర్,యూసుఫ్‌గూడ,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్,కూకట్‌పల్లి,కుత్బుల్లాపూర్,జీడిమెట్ల,నిజాంపేట్,బోయిన్‌పల్లి,సికింద్రాబాద్,ఉప్పల్,మల్కాజిగిరి,నాగోల్, బేగంపేట్, ముషిరాబాద్, లక్డికాపూల్,నాంపల్లి,కోఠి,ఎల్బీనగర్,రాజేంద్రనగర్,అత్తాపూర్,లంగర్‌హౌస్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలుప్రాంతాల్లోని ప్రధాన రహదారులు వరదకాలువల్లాగా మారాయి. షేక్‌పేట్,యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో కార్లు నీటమునిగాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో భారీగా ట్రాఫిక్‌జాం అయ్యింది. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యూసుఫ్‌గూడలో వాహనాలు వరద ఉదృతికి కొట్టుకుపోయాయి.
దీంతో లక్డికాపూల్ నుంచి గచ్చిబౌలి,గచ్చిబౌలి నుంచి మాదాపూర్,హైటెక్‌సిటీ, మియాపూర్ వెళ్లే ప్రాంతాలు, చందానగర్ నుంచి బాలానగర్, బాలానగర్ నుంచి మాసాబ్‌ట్యాంక్,సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. కిలోమీటర్ దూరానికి కూడా అరగంటకు పైగా సమయం పట్టడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. సోమవారం రాఖీ పండగ సందర్బంగా కుటుంబమంతా సోదరసోదరీమణులకు రాఖీలు కట్టేందుకు వెళ్తుండటంతో నగరం సందడిగా మారింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్డెక్కడంతో అప్పటికే రహదారులు రద్దీగా మారాయి. అయితే, మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షం కురవడం…ఒక్కసారిగా రహదారులపై వరదనీరు చేరడంతో నగరం నరకాన్ని తలిపించింది. సాయంత్రం వరకు నగర రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఇదిలావుండగా, నగరంలో వర్షాలు కురిసినప్పుడే అధికారులు స్పందిస్తున్నారే తప్పా ఇబ్బందులు తలెత్తకుండా ముందుస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని నగరవాసులు మండిపడుతున్నారు.