మహారాష్ట్రలో భారీ వర్షాలు
గోదారి ఉధృతితో దెబ్బతిన్న నాసిక్ జిల్లా
పుణ్యక్షేత్రాల జలదిగ్బంధంతో భక్తుల విలవిల
గడ్చిరోలిలో ముగ్గురు మృతి పలువురు గల్లంతు
తాకిడి ప్రాంతాలకు సిఎం డిప్యూటీ సిఎం
ముంబై: మహారాష్ట్రలో వరుసగా కుండపోత వానలు పడుతున్నాయి. నాసిక్‌లో పలు చోట్ల జలవిలయం సంభవించింది. గడ్చిరోలిలో ముగ్గురు మరణించగా, పలువురు వర్షాల ధాటికి గల్లంతయ్యారు. మహానగరం ముంబైలో ఓ మోస్తరు వానలు వీడకుండా పడుతున్నాయి. నాసిక్ జిల్లాలో పలు నదులు పొంగుపొర్లుతున్నాయి. గోదావరి ఉధృతంగా దిగువకు పారుతోంది. ప్రత్యేకించి నాసిక్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ ప్రాంతంలో ఉన్న పలు దేవాలయాల పట్టణాలను పక్కనే పారే నదులు ముంచెత్తుతున్నాయి. దీనితో షిర్డీ ఇతర ప్రాంతాలకు దూరం నుంచి వచ్చిన భక్తులు, యాత్రికులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. రవాణా సౌకర్యాలు విచ్ఛిన్నం అయ్యాయి. నాసిక్ జిల్లాకు వరదల ముప్పు ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 14వ తేదీ వరకూ ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు అప్రమత్తం అయ్యి వ్యవహరించాలని వాతావరణ శాఖ సూచించింది. వచ్చే 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అంచనా వేశారు.
దీనితో పల్లపు ప్రాంతాల ప్రజలు మరింతగా ఆందోళనకు గురయ్యారు. గోదావరి, ఇతర నదుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో పలు జాతీయ రహదారులపై భద్రతలను కట్టుదిట్టం చేశారు. గడ్చిరోలి జిల్లాలో పొంగిపొర్లుతున్న నాలాలలో పడి కొట్టుకుపోయిన ముగ్గురి భౌతికకాయాలను ఇప్పుడు వెలికితీశారు. ఇప్పటికి కొందరి జాడ తెలియడం లేదు. నాసిక్ జిల్లాలోని సుర్గానాలో గడిచిన 24 గంటల వ్యవధిలో 238.8 మిమిల వర్షపాతం నమోదైంది. ఇది అధిక రికార్డుగా నమోదైంది. గడ్చిరోలి ఇతర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం సాయంత్రం పర్యటించారు.
Heavy Rainfall in Maharashtra