మన తెలంగాణ/హైదరాబాద్ :చెవులు చిల్లులు పడేంత టి భీకర శబ్దాలతో ఉరుములు, కళ్లు మిరుమిట్లు గొలుపుతూ లక్షల ఓట్ల వెలుగులతో మెరుపులు ..పిడుగులు మీదపడతున్నాయా?అన్నంతా భయాందోళనలు.. కుం భవృష్టితో రాష్ట్రం గిలగిలలాడింది. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలో భారీ నుంచి అతిభారీ వర్షం కుండపోతగా కురిసింది.రోడ్లన్ని వర్షపు నీటితో వాగుల ను తలపించాయి. చూస్తుండగానే లోతట్టు ప్రాంతాలు వరదనీటితో జలమయం అయ్యాయి. జనజీవనం అతలాకుతలంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సా యంత్రం వేళ ఇళ్లకు చేరుకోవాల్సిన ఉద్యోగులు, విధ్యార్ధులు,వివిధ వర్గాల ప్రజలు
నడిమధ్యన వర్షంలో చిక్కి విలవిలలాడిపోయారు.సచివాలయం , ట్యాంక్‌బండ్, అబిడ్స్ ,హిమయత్ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నైరుతి రుతుపవనాలు తిరోగమించాల్సని తరుణంలో పోతూ పోతూ భీకర రూపం ప్రదర్శిస్తున్నాయి. వీటికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు తుపాన్ల రూపంలో దూసుకురాబోతున్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనలు మరింత ఆందోళన గొలుపుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో 77.2 మి.మి వర్షం కురిసింది. నల్గొండ జిల్లా చందంపేట్‌లో 72.5, సంగారెడ్డి జిల్లా మొద్గంపల్లిలో 69.2, జనగాం జిల్లా కొడకండ్లలో 66.6, యాదాద్రి జిల్లా మోత్కూర్‌లో 51.5, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 48.8 మి.మి వర్షం కురిసింది.
గ్రేటర్‌పై కుంభవృష్టి:
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సాయంత్రం కుంభవృష్టి కురిసింది. భారీ శబ్ధాలతో కూడిన ఉరుములు , మెరుపులతో నగరం భీతిల్లింది. కుండపోతగా కురిసిన వర్షంతో కొద్దిపాటి సమయంలోనే రోడ్లన్ని జలమయం అయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. పలు చోట్ల మ్యాన్‌హోల్స్ మూతలు తెరుచుకుని వర్షపు నీరు ఫౌంటెన్లను తలపించే రీతిలో పైకి ఎగచిమ్మింది. రోడ్లు బ్లాక్ అయ్యాయి. రోడ్లపైనే వాహనాలు నిలిచి పోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంలు పడ్డారు. వాహనాలు ఇంజన్ ఆపేస్తే ఎక్కడ వర్షపు నీరు ఇంజన్‌లోకి చేరుతుందోనని రోడ్లపైనే వర్షపు నీటిలో వాహనాలు స్విచ్‌ఆఫ్ చేయకుండా టూవీలర్లను నెట్టుకుంటూ నరకయాతన పడ్డారు. పాదాచారులు కూడా వర్షపు నీటిలో నిలువునా తడిసిముద్దయ్యారు. సికింద్రాబాద్, తార్నాక, ఓయూ క్యాంపస్ , లాలాపేట, హయత్‌నగర్, దిల్‌సుఖ్ నగర్, నాచారం , మల్లాపూర్, ఉప్పల్ , మేడిపల్లి, కోఠి , అబిడ్స్, బేగంబజార్ పంజాగుట్ట తదితర ప్రాంతాలో భారీ వర్షం కురిసింది. నాంపల్లిలో అత్యధికంగా 63.6మి.మి వర్షం కురిసింది. హియాయత్ నగర్‌లో 62.5, ముషీరాబాద్‌లో 57.5 మి.మి.వర్షం కురిసింది.చార్మినార్‌లో 47.7, మారెడ్‌పల్లిలో 48.5మి.మి వర్షం కురిసింది.
దూసుకొస్తున్న తూపాన్!
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఎగువ గాలులతో కొనసాగిన ఆవర్తనం కేద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల సోమవారం వాయువ్య ,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతారవణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం నల్లగొండ, సూర్యాపేట మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైడరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి ,వికారాబాద్, సంగారెడ్డి ,మెదక్ , గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్లి, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అధికారులు అప్రమత్తంగాఉండాలి:మంత్రి పొన్నం
భారీ వర్షాల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అదేశాలిచ్చారు. మ్యాన్‌హోల్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ , పోలీస్ ,డిఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదేశించారు . లోతట్టు ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని , ప్రాణనష్టం జరగకుడా చూసుకోవాలని హెచ్చరించారు. నగరంలో ని 141 వాటర్ లాగింగ్ పాయింట్లలో జిహెచ్‌ఎంసి సిబ్బంది అక్కడే వుండి చర్యలు చేపట్టాలన్నారు.