Saturday, November 23, 2024

కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలం

- Advertisement -
- Advertisement -
Heavy rainfall In Uttarakhand
34 మంది మృతి, మరో ఐదుగురు గల్లంతు
కూలిన కొండచరియలు, కొట్టుకు పోయిన వంతెనలు,రైల్వేట్రాక్‌లు ధ్వంసం
వందలాది ఇళ్లు నేలమట్టం, శిధిలాల కింద పలువురు
300 మందిని కాపాడిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు
నైనిటాల్‌కు బయటి ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన ప్రధాని మోడీ

డెహ్రాడూన్/నైనిటాల్: ఎడతెరిపి లేని వర్షాలకు దేవభూమి ఉత్తరాఖండ్ అతలాకుతలమయింది. వరసగా మూడో రోజు మంగళవారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా కుమావున్ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురవడంతో పలు ఇళ్లు నేల మట్టమయ్యాయి. అనేక వంతెనలు కొట్టుకు పోయాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డం. ఇళ్లు నేలమట్టం కావడంతో మంగళవారం మరో 19 మంది చనిపోయారు. ఇప్పటివరకు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 34 మంది చనిపోయారని, మరో ఐదుగురి జాడ తెలియడం లేదని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విలేఖరులకు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సిఎం ఇళ్లు కోల్పోయిన వారికి రూ.1.9 లక్షల సాయం అందజేస్తామని తెలిపారు. మంగళవారం విద్యాశాఖ మంత్రి ధన్‌సింగ్ రావత్‌లో కలిసి వరద ప్రభావప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. అత్యధిక మరణాలు నైనిటాల్ జిల్లాలోనే సంభవించాయని రాష్ట్ర డిజిపి తెలిపారు.

కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా విరిగి పడిన కొండచరియలు, నీట మునిగిన ఇళ్లు, రోడ్లు, నేలమట్టమైన ఇళ్ల దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రజలు నడుం లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నైనిటాల్ పట్టణంలో కనిపిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నైనిటాల్‌కు వెళ్లే దారులన్నీ జలదిగ్బంధం కావడంతో పట్టణానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కాలా ధుంగి, హల్దానీ ప్రాంతాల్లో కూడా కొండచరియలు విరిగిపడ్డంతో ఆ ప్రాంతానికి వెళ్లే రోడ్లను కూడా మూసివేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 19 మరణాలు సంభవించాయి. నైనిటాల్‌లోని ముక్తేశ్వర్, ఖైర్నా ప్రాంతాల్లో ఇళ్లు కూలిన సంఘటనల్లో ఏడుగురు చనిపోయారు. ఉధమ్‌సింగ్ నగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి వరద నీటిలో కొట్టుకు పోయారు. రాష్ట్రంలోని వరద బాధితులను కాపాడేందుకు మూడు సైనిక హెలికాప్టర్లను పంపిస్తున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అంతకుముందు డెహ్రాడూన్‌లో విలేఖరులను చెప్పారు.

రెండు హెలికాప్టర్లను నైనిటాల్‌కు, ఒక హెలికాప్టర్‌ను గర్వాల్ రీజియన్‌కు పంపిస్తున్నామని ఆయన చెప్పారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఈ హెలికాప్టర్ల సాయంతో కాపాడతామని ఆయన తెలిపారు. ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ప్రస్తుతం ఎక్కడున్న వారు అక్కడే ఉండాలని, వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తిరిగి యాత్రను కొనసాగించవచ్చని తెలిపారు. భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల ముఖ్యంగా రైతులు ఎక్కువగా నష్టపోయారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు ఫోన్ చేసి రాష్ట్రంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అన్ని విధాలుగా రాష్ట్రానికి సాయపడతామని హామీ ఇచ్చారన్నారు.

24 గంటల్లోనే 500 మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురవడంతో నైని సరస్సు పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు పట్టణంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది. నైనిటాల్‌లోని మాలి రోడ్డు, నైని సరస్సు ఒడ్డున ఉన్న నైనా దేవి ఆలయం వరదల్లో చిక్కుకు పోయాయి. కొండచరియలు విరిగిపడ్డం వల్ల ఓ హాస్టల్ భవనం దెబ్బతిన్నది.. పట్టణంలో చిక్కుపడిపోయిన పర్యాటకులకు సాయపడేందుకు అధికారులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. పట్టణంలోకి వచ్చే వారిని, వెళ్లే వారిని హెచ్చరించేందుకు పోలీసులను నియమించినట్లు, వర్షాలు తగ్గుముఖం పట్టే దాకా ఎక్కడి వారు అక్కడే ఉండాలని వారు టూరిస్టులను హెచ్చరిస్తున్నారని నైనిటాల్‌నుంచి అందిన వార్తలను బట్టి తెలుస్తోంది.

ధ్వంసమైన రైల్వే ట్రాక్

కుండపోత వర్షాలకు రాష్ట్రంలోని నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదలకు పలు చోట్ల్ల వంతెనలు, రహదారులు, రైల్వేట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. గౌల్వా నది వరద ఉధృతికి మంగళవారం ఉదయం హల్దానీ వద్ద కత్కోడామ్ ఢిల్లీ రైల్వేలైన్ దెబ్బతిన్నది. ట్రాక్ కింద మట్టి, కంకర పూర్తిగా కొట్టుకు పోయాయి. దీంతో రైల్వేట్రాక్ ధ్వంసమైంది. దీంతో అధికారులు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపి వేశారు. కోశి నది వరద నీరు రాంనగర్ రాణిఖేత్ మార్గంలోని లెమన్ ట్రీ రిసార్ట్‌ను ముంచెత్తడంతో దాదాపు 200 మంది పర్యాటకులు రిసార్ట్‌లో చిక్కుపడిపోయారు. వీరందరినీఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఇప్పటివరకు వరదల్లో చిక్కుపడిన 300 మందిని కాపాడినట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తెలిపాయి. కాగా మంగళవారం రాత్రినుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడం ఊరటనిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News