Friday, November 22, 2024

పల్లె కన్నీళ్లు

- Advertisement -
- Advertisement -

Heavy rains across Telangana

రాష్ట్రమంతటా వర్ష బీభత్సం,
నల్లగొండ జిల్లాలో బైకుపై వెళ్తూ కొట్టుకుపోయిన వ్యక్తులను తాళ్లతో కాపాడిన స్థానికులు
కొమురంభీం జిల్లాలో ఎడ్లబండిపై పిడుగుపాటు, ముగ్గురు దుర్మరణం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గండిపడ్డ చెరువులు, దెబ్బతిన్న రోడ్లు, జలమయమైన గ్రామాలు, నీట మునిగిన పంటపొలాలతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎటూ చూసిన నీళ్లతో ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు ఎడ్లబండిపై శుక్రవారం సాయంత్రం పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగుపాటు పడడంతో ముగ్గురు రైతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జలపాతం చూద్దామని నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తపూర్ గ్రామానికి హైదరాబాద్, బాసర చెందిన రెండు కుటంబాల సభ్యులు అక్కడకు వెళ్లి వాగులో చిక్కుకున్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో వారిని రక్షించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నర్సాపూర్ గ్రామానికి చెందిన రాయిసిడాం జంగు ద్విచక్ర వాహనంతో వాగుదాటే క్రమంలో వరదలో కొట్టుకుపోయారు. వెంటనే స్థానికులు ఆయన్ను కాపాడారు.

బైకుపై వెళ్తున్న వ్యక్తులు ఇద్దరు నీళ్లలో….

నల్గొండ జిల్లాలో కురిసిన వానకు నరసింహులగూడెం దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా శుక్రవారం బైకుపై వెళ్తున్న వ్యక్తులు ఇద్దరు నీళ్లలో పడి కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్ల సాయంతో వారిని కాపాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని పల్లె ప్రాంతాల ప్రజలు వర్షాలు, వరదలతో నిత్యావసర సరుకులను బయట నుంచి తెచ్చుకోలేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపల్లి వాసులు రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులు తీసుకునేందుకు బజార్‌హత్నూర్‌కి వచ్చి వరదలో చిక్కుకుపోయారు. భారీ వర్షం కారణంగా నిర్మల్ జిల్లాలోని వాడి గ్రామం దగ్గరున్న బ్రిడ్జి కూలిపోవడంతో వాడి-కోతల్‌గామ్ గ్రామాలకు బాహ్య సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు.

శనివారం నుంచి మూడు రోజులు

గురువారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు వరద నీటితో జలమయం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ చేసింది. శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవగా, శనివారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

రాష్ట్రంలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.

6న మధ్య బంగాళాఖాతంతో అల్పపీడనం

రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు రోజుల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 6న మధ్య బంగాళాఖాతంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉధృతంగా నక్కవాగు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాల కారణంగా వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా వాసులకు ఈ వర్షాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. సేవాలాల్ తండా వాసులు పొలాలు నక్కవాగు అవతలి వైపు తెర్ల మద్ది ప్రాంతంలో ఉన్నాయి. అయితే పొలాలకు వెళ్లాలంటే నక్కవాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వాగుపై రెండేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టినా నిధుల లేమి కారణంగా ఏడాదిగా పనులు నిలిచి పోయాయి. ప్రస్తుతం ఆ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులు దాటలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పిల్లర్లపై తాటి చెట్టు వేసి దానిపై నుంచి నడుస్తున్నారు.

కొంపల్లి ఉమామహేశ్వర కాలనీలోకి వరద

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని ఉమామహేశ్వర కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానికుల ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి పైపులైన్ పనులు పూర్తికాకపోడంతో కాలనీ వరదనీటితో నిండిపోవడంతో అధికారులు ఆ నీటిని మళ్లీంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

నీటమునిగిన ముత్యాలమ్మ ఆలయం

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం శేషి లేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుర్రంపోడులోని ముత్యాలమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయం సగం వరకు నీట మునిగిపోయింది. వరద ఉధృతికి కొత్తలాపురం, నడ్డివారిగూడెం వెళ్లే మార్గంలో కల్వర్టు కొట్టుకుపోయింది. శేషిలేటి వాగు ప్రవాహానికి కొత్తలాపురం నుంచి రెండు, మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చండూరు, మునుగోడు మండలాల్లోని పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చండూరు మండలంలోని చండూర్, బొడంగిపర్తి వాగు ఉద్ధృతితో చండూర్- మునుగోడుకు రాకపోకలు నిలిచిపోయాయి.

మాల్ ప్రధాన రహదారిపై అంగడిపేట వాగు ఉద్ధృతితో చండూర్, మాల్, మర్రిగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి. శిర్దేపల్లి వాగు జోరుగా ప్రవహిస్తుండడంతో చండూర్ నుంచి శిర్దేపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. కొండాపురం, ఫుల్లెంలా ల్లోని వాగులు పొంగిపొర్లటంతో గట్టుపల్ నుంచి చండూర్‌కు రవాణా వ్యవస్థ స్తంభించింది. బంగారిగడ్డ గొల్లగూడెం వెళ్లే రోడ్డు సైతం తెగిపోవటంతో చండూర్‌కు రావాల్సిన అన్ని దారులు స్తంభించాయి. మునుగోడు మండలంలోని కొరటికల్, మునుగోడు మండలలోని మర్రివాగు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలతో అక్కడక్కడ పం టలు నీటమునిగాయి. పత్తిపంటలో నీళ్లు చేరి తెగుళ్ల బారిన పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రమాదకరంగా బండ్రేవు వాగు

ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ వాసులు ప్రమాదకరంగా కాలం వెళ్లదీస్తున్నారు. బండ్రేవు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. నిత్యావసరాలు, అత్యవసరం వచ్చిందంటే క్షేమంగా ఒడ్డుకు చేరతారనే నమ్మకం లేకపోయినా ముందుకు సాగుతున్నారు. అదిలాబాద్ జిల్లా బజార్హట్నూర్ మండలం కొత్తపల్లి గిరిజనులు నిత్యావసరాల కోసం స్థానిక బండ్రేవు వాగును దాటాలి. గురువారం వారాంతపు సంత కోసం బజార్హట్నూర్ వెళ్లారు. సరకులు తీసుకొని వాగువద్దకు చేరగా ఉధృతి పెరిగింది. ఏం చేయాలో పాలుపోని గిరిజనులు నెత్తిన సరుకుల బరువు మోస్తూనే ఒకరిచేయి ఒకరు పట్టుకొని ప్రమాదకరంగా వాగుదాటారు.

హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం

రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సరూర్‌నగర్ పరిధిలోని కోదండరామ్‌నగర్ వాసులు ఇళ్లలోకి నీళ్లు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరంతా ఇళ్లలోకి చేరడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తింది.

బ్రిడ్జిపై నుంచి మూసీనది ప్రవాహాం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. బీబీనగర్, వలిగొండ మండలాల్లో ముసురు కమ్ముకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగెం – బొల్లెపల్లి గ్రామాల మధ్య ఉన్న భీమలింగం వద్ద లోలెవెల్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి మూసీ నది ప్రవహిస్తుంది. వరద ఉద్ధృతితో సంగెం- బొల్లెపల్లి పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News