Saturday, December 28, 2024

తెలంగాణపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం….

- Advertisement -
- Advertisement -

Heavy rains across Telangana

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
షీయర్ జోన్ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు
ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ
ఐదు జిల్లాల్లో అతిభారీ,
18 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం
శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. షీయర్ జోన్ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే 18 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

తడిసిముద్దయిన భాగ్యనగరం

శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. అత్యవసర సాయం కోసం 040-29555500 నెంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.

వర్షం దెబ్బకు బాటసింగారం పండ్ల మార్కెట్‌లో ఇబ్బందులు

శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీవర్షానికి బాటసింగారం వ్యాపారులకు కొత్త కష్టం తీసుకొచ్చింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ గాలి వానకు పూర్తిగా దెబ్బతింది. టెంట్లు ఎగిరిపోగా వరదనీటిలో పండ్లన్నీ కొట్టుకుపోవడంతో రైతులు, వ్యాపారులకు నష్టాన్ని మిగిల్చాయి. భారీ గాలివానలకు హైదరాబాద్ శివారులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ పండ్ల మార్కెట్ టెంట్లు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం పండ్ల మార్కెట్‌ను ముంచెత్తింది. పండ్ల దుకాణాలన్నీ తడిసిపోయాయి. కొత్తపేట గడ్డిఅన్నారం మార్కెట్‌ను తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారం హెచ్‌ఎండిఏ లాజిస్టిక్స్ పార్కులోకి తరలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక సౌకర్యాలు సైతం వర్షానికి దెబ్బతినడం గమన్హారం.

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి…మహబూబాబాద్‌లో 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, జనగాంలో 17, సూర్యాపేటలో 14, ఖమ్మంలో 12, యాదాద్రి భువనగిరిలో 11, మహబూబ్‌నగర్‌లో 16.5, వరంగల్‌లో 11, మేడ్చల్ మల్కాజిగిరిలో 11.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News