Monday, November 18, 2024

పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు

- Advertisement -
- Advertisement -

Heavy rains across telangana

పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లను జారీ చేసిన వాతావరణ శాఖ
ఉత్తర తెలంగాణలో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు
మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
ట్రాఫిక్ మళ్లీంపుతో వాహనదారులకు ఇబ్బందులు
మేడ్చల్ మల్కాజిగిరిలో 95, రంగారెడ్డిలో 86, హైదరాబాద్‌లో 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా నగరంలోని రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లను వాతావరణ శాఖ జారీ చేసింది.

జియాగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లలో…

బుధవారం నగరంలోని మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లిలో ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నీట మునిగిన మూసారాంబాగ్ బ్రిడ్జి

మూసీనదికి భారీగా వరదనీరు పోటెత్తడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లీంచారు. ఈ బ్రిడ్జిని మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సీజన్‌లో ఈ బ్రిడ్జిని మూసేయడం ఇది రెండోసారి. ఈ బ్రిడ్జిని మూసేయడంతో చాదర్‌ఘట్ బ్రిడ్జి నుంచి నల్లగొండ ఎక్స్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో కొన్ని చోట్ల నాలాల నుంచి నీరు బయటకు రావడంతో ఆ నీరంతా రోడ్లపైకి చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి బుధవారం బలహీనపడిందని వాతావరణ సంచాలకులు తెలిపారు. బుధవారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడి సముద్రమట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆమె వివరించారు.

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు…

మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి -40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

9వ తేదీన…

ఈనెల 9వ తేదీన మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.

10వ తేదీన….

ఈనెల 10వ తేదీన మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌లో 80 మిల్లీమీటర్లు

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 86 మిలీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్‌లో 55, భద్రాద్రి కొత్తగూడెంలో 65, హన్మకొండలో 39, ములుగులో 37, నిజామాబాద్‌లో 36, జయశంకర్ భూపాలపల్లిలో 35.5, ఖమ్మంలో 35, మంచిర్యాలలో 33.5, నిర్మల్‌లో 32, మేడ్చల్ మల్కాజిగిరిలో 95, హైద రాబాద్‌లో 80, నాగర్‌కర్నూల్‌లో 89, యాదాద్రి భువనగిరి 72, జనగాం 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News