11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఈ ఏడాది ఇప్పటికే 127 శాతం వర్షపాతం నమోదు
జూలై రెండో వారంలో అధిక వర్షపాతం..
జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల,
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికంగా 196 శాతం వర్షపాతం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ కేంద్రం డైరెక్టర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. 8 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షకాల సీజన్ జూలై రెండో వారంలో అధిక వర్షపాతం నమోదైందని ఆమె వివరించారు. 2015లో జూలైలో 67 శాతం వర్షపాతం నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటికే 127 శాతం వర్షపాతం నమోదయిందని ఆమె తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 196 శాతం వర్షపాతం నమోదయిందన్నారు. తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఆమె తెలిపారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
దీనికి తోడు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆమె తెలిపారు. వీటికి తోడు షియర్ జోన్ కూడా కొనసాగుతోందని ఈ నేపథ్యంలో తెలంగాణలో 11 జిల్లాలకు మరోసారి రెడ్ అలర్ట్ ప్రకటించామని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, రాత్రి సమయాల్లో ఓ మోస్తరుతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలకు తోడు గాలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని నాగరత్న తెలిపారు.
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండి హెచ్చరిక
పశ్చిమ తీర ప్రాంతాలతోపాటు, సెంట్రల్ ఇండియాలో వారం రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వానలు, మరో ఐదు రోజులపాటు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఛత్తీస్‌ఘడ్, విదర్భ, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తునప్పటికీ, మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎమ్.మోహాపాత్రా తెలిపారు. మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.