మరి 3రోజుల పాటు అతి భారీ వర్షాలు
వర్షాలకు తోడైన అల్పపీడనం
ఊదుల చెరువు దాటుతూ భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం
మంజీర తీర ప్రాంతంలో చేపలు పట్టడానికి వెళ్లి యువకుడు గల్లంతు
వరదలో చిక్కుకున్న రెండు బస్సులలోని ప్రయాణికులను కాపాడిన రెస్కూ టీం
ఆడుకుంటూ నీటిలో కొట్టుకుపోయిన చిన్నారి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోపై ఉదయం నుంచి కొన్ని చోట్ల జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షం కురవడంతో వాహనదారులతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ఫలితంగా మరో మూడురోజుల పాటు అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇళ్లలోనుంచి ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
రెండు, మూడు రోజుల్లో వాయువ్య దిశగా అల్పపీడనం…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఆదివారం మరట్వాడ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ద్రోణి సోమవారం బికనూర్, జయపుర, గుణా, సియోని, గొందియా, గోపాల్ పూర్, వాయువ్య పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలోని అల్పపీడనం మీదగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 174 మిల్లీమీటర్ల వర్షపాతం, వరంగల్ రూరల్‌లో 146, మహబూబాబాద్‌లో 116, వరంగల్ అర్భన్ 116, జనగాం 103, పెద్దపల్లి 101 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడి మృతి
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మసానిపల్లె గ్రామానికి చెందిన బెస్త శేఖర్, మంజీర తీరప్రాంతంలోని గండి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు.
భద్రాద్రి రామయ్య ఆలయ పరిసరాలు నిర్మానుష్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి మండలాల్లోని చాలా పాఠశాలలు, వసతి గృహాల్లోకి వరద నీరు చేరడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాల వల్ల భద్రాద్రి రామయ్య ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. మణుగూరు, ఖమ్మం డిపోలకు చెందిన రెండు బస్సులు స్సులు మండల కేంద్రంలోని అండర్‌రైల్వే బ్రిడ్జిలోని వరదనీటిలో చిక్కుకుపోవడంతో రెస్యూటీం సుమారు 40 మంది ప్రయాణికులను కాపాడింది.
పాల్వంచ మండలంలోని ఏడు గ్రామాలకు రాకపోకలు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు జల్లులు పడుతున్నాయి. పాల్వంచ మండలంలోని ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పాల్వంచ పట్టణంలోని అంజలి అనే చిన్నారితో ఆమె అన్నతో బయట ఆడుకుంటుండగా వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో స్థానికులు బాలుడిని కాపాడారు. బాలిక మాత్రం మృత్యువాత పడింది.
ముళ్లపొదల్లో మృతదేహం..
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ మామిడి వాగును ఆదివారం ద్విచక్ర వాహనంపై దాటుతూ గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. మృతుడు ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన కమలాకర్‌గా గుర్తించారు.
కామారెడ్డి జిల్లాలో రాకపోకలు బంద్…
కామారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగుతున్నాయి. పిట్లం మండలం రాంపూర్‌కలాన్ వద్ద లోలెవల్ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పిట్లం, బాన్సువాడ మండలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రహదారులు జలమయం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరువానలకు రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు వరకు నీరు చేరడం వల్ల వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి టు దుగ్గొండి గ్రామాల మధ్య ఉన్న ఊదుల చెరువు దాటుతున్న క్రమంలో వెంకట్‌రెడ్డి అనే భవన నిర్మాణ కార్మికుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
లోతట్టు ప్రాంతాల్లో మేయర్ పర్యటన
కరీంనగర్‌లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యానగర్, రాంనగర్, కరీంనగర్, జ్యోతి నగర్, ముకరంపుర, శ్రీనగర కాలనీల్లోని ప్రధాన రహదారులు నీటమునిగాయి. నగర పాలక మేయర్ సునీల్‌రావు, కమిషనర్ అగర్వాల్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రోడ్లు ఛిద్రం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, ఘట్‌కేసర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న వర్షాలకే రోడ్లు ఛిద్రమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిండుకుండలా మారిన వనదుర్గ ప్రాజెక్టు
భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో ఉన్న వనదుర్గ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తోన్న వరద నీటితో పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం సమీపంలో వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.