కోస్తా, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు
భద్రాద్రి కొత్తగూడెం 218, కరీంనగర్‌లో 148 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
మనతెలంగాణ/ హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఒక ద్రోణిగా కొనసాగుతోందని దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ సూచించింది.
రోడ్లపైకి నీరు…
హైదరాబాద్‌లో నాలుగు రోజుల నుంచి జోరుగా వానలు కురుస్తుండడంతో లోతట్టు ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట, అత్తాపూర్, బండ్లగూడ, మెహిదీపట్నం, ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అలాగే కార్వాన్, లంగర్‌హౌస్, గోల్కొండ, మల్లేపల్లి , హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారుల పైకి నీరు రావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం…
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం 218 మిల్లీమీటర్లు, కరీంనగర్‌లో 148, మహబూబాబాద్‌లో 125, జగిత్యాలలో 115, నారాయణపేటలో 99, సంగారెడ్డిలో 92, రంగారెడ్డిలో 90, నిజామాబాద్‌లో 89, రాజన్న సిరిసిల్లలో 80, మేడ్చల్ మల్కాజిగిరిలో 52, హైదరాబాద్‌లో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.