ఐఎండి హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఉత్తర ,తూర్పు జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.విదర్భ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ద్రోణి బలహీనపడిందని పేర్కొంది. ఝార్ఖాండ్ నుంచి చత్తీస్‌గడ్ విదర్బ మీదుగా ఉత్తర మహారాష్ట్ర వరకూ ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 3.1కిమి నుంచి 4.5కిమి ఎత్తు మధ్య కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఉపరితల ఆవర్తనం విదర్బ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 4.5కి ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణ అంతటా గత 24గంటలుగా విస్తారంగా వర్షాలు కురిసినట్టు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడ పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో పలుప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్ ,అబిడ్స్ ,నాంపల్లి ,బషీర్ బాగ్ లక్డికపూల్ , హియయత్ నగర్ , ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
పైర్లకు ప్రాణం పోసిన వర్షాలు.
రాష్ట్రంలో గత రెండు రోజులనుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ పంటలకు ప్రాణం పోస్తున్నాయి. మూడు వారాలకు పైగా రాష్ట్రంలో చినుకు జాడ లేకపోవటంతో వర్షాధారంగా సాగు చేసిన కంది , పెసర ,మినుము , పత్తి, తదితర పైర్లు బెట్టకు గురయ్యాయి. నేలలో తేమశాతం తగ్గిపోయి పైర్లు వాడిపోయి రైతులు ఆందోళన చెందుతున్న దశలో వచ్చిన వర్షాలు ఎండుతున్న పైర్లను తిరిగి కోలుకునేలా చేశాయి. బెట్టనుంచి పైర్లు బతికిపోవటంతో రైతులు హర్షం వెలిబుచ్చుతున్నారు.
26శాతం అధిక వర్షపాతం:నాగరత్నం
రాష్ట్రంలో ఇప్పటివరకూ సాధారణ వర్షపాతం కంటే 26శాతం అధికవర్షపాతం నమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. ఈ సీజన్‌కు సంబంధించి జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 443మి.మి వర్షపాతం రికార్డయినట్టు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులు తున్నాయన్నారు. గురువారం నాడు పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు తెలిపారు. అత్యధికంగా తాళ్లమడుగులో 13సెం.మి వర్షం కురిసిందిని తెలిపారు. జె.హత్నూర్‌లో 12,తాంమ్సి, అదిలాబాద్‌లో , సిర్పూర్‌లలో 10సెం.మి వర్షపాతం నమోదయినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 27డిగ్రీలు, కనిష్టంగా 22డిగ్రీలు నమోదయినట్టు తెలిపారు.