మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం శుక్రవారం తెలంగాణ పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి ఉపరితల ద్రోణి శుక్రవారం కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ లోని ఆవర్తనం పరిసరాల్లోని విదర్భ మీదుగా పశ్చిమ మధ్యప్రదేశ్ వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.