తడిసిముద్దయిన నగరం
పలు జిల్లాలోనూ వానలు
రాగల మూడురోజులు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్: రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నల్లగొండ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్‌లో రెండో రోజూ కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బేగంబజార్, ట్రూప్‌బజార్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. నారాయణగూడ, హైదర్‌గూడ, హిమాయత్‌నగర్ సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైస్, చిలకలగూడ, అల్వాల్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి ద్విచక్రవాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు.
మరో ఉపరితల ఆవర్తనం ఈశాన్యం
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారం వాయువ్యం దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్రమట్టానికి 3.1కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఉపరితల ఆవర్తనం ఈశాన్యం దాన్ని అనుకొని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ ఒకటిన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బుధవారం కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం
రంగారెడ్డి జిల్లాలో 70 మిల్లీమీటర్లు, సంగారెడ్డిలో 55, యాదాద్రి భువనగిరిలో 55, నాగర్‌కర్నూల్‌లో 43, మేడ్చల్ మల్కాజిగిరిలో 45, హైదరాబాద్‌లో 42, సూర్యాపేటలో 39, మంచిర్యాలలో 32 మిల్లీమీటర్ల వర్షపాతం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.