హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణకు ఎఫెక్ట్
జనగాంలో 108 మిలీమీటర్ల వర్షపాతం నమోదు
హైదరాబాద్: రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీవర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణితో పాటు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందనిచ ఇది ఒడిశా తీరానికి వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్నం తెలిపారు.
తార్నాక, హబ్సిగూడ, నాచారంలో భారీ…
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో పలుచోట్ల మధ్యాహ్నం వర్షం ప్రారంభం కాగా రాత్రి వరకు చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, కీసర, రాంపల్లి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, ప్రగతినగర్, బాలానగర్, చింతల్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, కుత్భుల్లాపూర్, జీడిమెట్ల, మియాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
మహబూబాబాద్‌లో 95 మిల్లీమీటర్లు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 87 మిల్లీమీటర్లు, రంగారెడ్డిలో 71, యాదాద్రి భువనగిరిలో 68.5, మంచిర్యాలలో 59, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 45.3, జనగాంలో 108, జయశంకర్ భూపాలపల్లిలో 39.8, మహబూబాబాద్‌లో 95, పెద్దపల్లిలో 37, ఖమ్మంలో 35, భద్రాద్రి కొత్తగూడెంలో 34,ములుగులో 20, సూర్యాపేటలో 54, వరంగల్ రూరల్ 94, వరంగల్ అర్భన్ 89, మెదక్ 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.