రాష్ట్రవ్యాప్తంగా 135 ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు
పిడుగుపాటుకు ఆరుగురి దుర్మరణం
కల్లాల్లో ఆరబోసిన ధాన్యం నేలపాలు
పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం
రేపు, ఎల్లుండి పలుచోట్ల వానలు కురిసే అవకాశం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. వివిధ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో పాటు పిడుగుపాటుకు ఆరుగురు దుర్మరణం చెందారు. దాదాపు 135 ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయని, (17 జిల్లాల్లో) తేలికపాటి వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల పిడుగులు పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశాపై 150 మీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, దీంతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నగరంలో కురిసిన వానకు పలుచోట్ల ట్రాఫిక్ జాం
నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నిజామాబాద్, జనగాం, భద్రాద్రి, యాదాద్రి, ఖమ్మం, నల్లగొండ సహా మరికొన్ని జిల్లాలో రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిందని , కొన్ని గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు ధాన్యం కొట్టుకుపోయిందని ఆయా గ్రామాల రైతులు పేర్కొన్నారు. నగరంలో కురిసిన వానకు పలుచోట్ల ట్రాఫిక్ జాం కావడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసి సిబ్బంది అప్రమత్తం చేయగా, మున్సిపల్ శాఖ డిఆర్‌ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఆత్మకూరులో 11 గొర్రెలు మృతి
ఆకాలవర్షాల కారణంగా పిడుగుపాటుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడ గ్రామానికి చెందిన రైతు దంపతులు దుర్మరణం చెందారు. వ్యవసాయ క్షేత్రంలోని చెట్టు కింద పనులు చేస్తుండగా పిడుగుపడడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఆత్మకూరులో 11 గొర్రెలు మృత్యువాతపడ్డగా, కాపరికి తీవ్రగాయాలయ్యాయి. బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన మన్నెరాములు పిడుగుపాటుతో మృతిచెందగా, సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందురు ప్రియాల్‌కు చెందిన రామయ్య, మంతూరుకు చెందిన యువరైతు నర్సింలుతో పాటు మెదక్ జిల్లా శంకర్‌పేటలోని ఇటుకబట్టీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు మృత్యువాతపడ్డాడు.