అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ప్రాంతాలో ఏక ధాటిగా వర్షం కురవడంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం స్పిల్ వే నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రోడ్లు జలమయంగా మారాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. రైవాడ, కొనాం జలశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
లోతట్టు ప్రాంతాల ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి కలెక్టర్ విజయ అదేశాలు జారీ చేశారు. కల్యాణపులోవ రిజర్వాయర్‌లో భారీగా వరద నీరు చేరింది. రిజర్వాయర్ సామర్థ్యం 460 అడుగులుకాగా ప్రస్తుతం 458.8 అడుగుల మేర నీరు ఉండడంతో గేట్లు ఎత్తి సర్పానదిలోకి నీటిని విడుదల చేశారు. అల్లూరి జిల్లాలోని జి మాడుగుల మండలం కుంబిడి సింగి బ్రిడ్జి పైనుంచి వరద ప్రవాహం ఉండడంతో రాకపోకలను పోలీసుల నిలిపివేశారు. డా బిఆర్ అంబేడ్కర్ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నదీ పాయకు గండి పడింది. తెగిన కట్ట మీద నుంచి జనం చోద్యం చూస్తున్నారు. విశాఖపట్నంలోని జ్ఞానాపురం పాత వంతెనపై నుంచి వరద ప్రవాహం ఉండడంతో రాకపోకలు నిలిపివేశారు.