జలమయమైన ఐటి కారిడార్
ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ జామ్
ఐటి, బ్యాంకింగ్ సంస్థలకు కోట్ల నష్టం
బెంగళూరు : గతరాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలతో బెంగళూరు లోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగి తేలుతున్నాయి. నగరం లోని ముఖ్య జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించింది. వరదనీటితో నగరం జలమయం కావడం వారంలో ఇది రెండోసారి. అపార్టుమెంట్లు పునాదులన్నీ నీటిలో మునిగాయి. అత్యవసరం తప్ప ప్రజలెవరూ బయటకు వెళ్లరాదని, పిల్లలను స్కూళ్లకు పంపరాదని ట్రాఫిక్ అధికార యంత్రాంగం హెచ్చరించింది. ఎకోస్పేస్ సమీపాన ఔటర్ రింగ్ రోడ్డు, బెల్లందూర్, కెఆర్ మార్కెట్, సిల్కుబోర్డు జంక్షన్, వర్తూర్ ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. ఐటి కారిడార్ కూడా జలమయమైంది. హెచ్‌బిఆర్ లేఅవుట్‌లో అనేక ఇళ్లు వాన నీటిలో మునిగాయి.
పాత ఎయిర్‌పోర్టు రోడ్డులో వరద నీటి మధ్యలో బస్సులు చిక్కుకున్నాయి. గత వారం భారీ వర్షాలకు ఈ రోడ్డు పూర్తిగా జలమయమైంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆ ప్రాంతాన్ని సందర్శించారు. సర్జాపూర్ రోడ్డులో ఎక్కువగా వరద నీరు నిల్చిపోవడంతో భవనాల సమీపాన పార్కింగ్ ప్రదేశాలు నీట మునిగి ఉన్నాయి. వర్తూర్ లోని బలగెరెపనధుర్ రోడ్డులో స్టార్మ్‌వాటర్ డ్రయిన్లు వాన నీటితో ఉప్పొంగి ప్రవహించడంతో ఆ రోడ్డంతా నదిలా మారింది. దాంతో సహాయక బృందాలు పడవలను ఉపయోగించవలసి వచ్చింది. మహాదేవ పుర లో 30 అపార్టుమెంట్ కాంప్లెక్సుల పునాదులు నీటిలో మునిగాయి. వైట్‌ఫీల్డ్ మెయిన్ రోడ్, ఓల్డు ఎయిర్‌పోర్టు, బలగెరె మెయిన్ రోడ్డు, సర్జాపూర్ రోడ్, యెమలూరు మెయిన్ రోడ్డు ట్రాఫిక్ స్తంభించింది. గోల్డ్‌మాన్ సాచ్స్, స్విగ్గీ వంటి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటివద్దనుంచే పనిచేయాలని సూచించాయి.
గత మంగళవారం ఇదే విధంగా భారీ వర్షాలతో నగరం లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లుకూలిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఫలితంగా కొన్ని వందల కోట్ల నష్టానికి దారి తీసిందని ఐటి, బ్యాంకింగ్ సంస్థలు ముఖ్యమంత్రికి ఒక లేఖ ద్వారా తెలియజేశాయి. నీరు నిల్చిపోవడంతో ఏర్పడిన నష్టాలపై ఐటి కంపెనీలతో చర్చిస్తానని, ఈమేరకు నష్టపరిహారం అందేలా ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి బొమ్మై వెల్లడించారు. ఈనెల 9 వరకు కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.