వెయ్యేండ్లలో ఎప్పుడూ లేని కుండపోత
హెనన్ ప్రాంతంలో తీవ్రస్థాయి నష్టం
25 మంది మృతి.. అరకోటి వరకూ వీధిపాలు
సబర్బన్ రైలుకు వరద తాకిడి
12 మంది జలసమాధి..గల్లంతు
సైన్యానికి దేశాధ్యక్షుడి పిలుపు
రైళ్లల్లో తలలే కన్పిస్తున్న వైనాలు
ఏడాది వాన మూడురోజుల్లో
బీజింగ్ : చైనాలో భారీ వర్షాలు జలవిలయం సృష్టించాయి. హెనన్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. గత 1000 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత ఉధృతంగా వదలకుండా భారీ వర్షాలు పడటంతో ఈ ప్రాంతంలో జనజీవితం నరకప్రాయం అయింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. నీటిలో అనేక రకాల వాహనాలు తేలియాడుతూ కన్పిస్తూ ఉన్నాయి. వర్షాలతో తలెత్తిన వరదలతో కనీసం 25 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 20 లక్షలకు పైగా మంది బాధితులు అయ్యారు. ఉన్న నివాసాలను వదిలి పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా ఇప్పటివరకూ లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమలు, సాంస్కృతిక కార్యక్రమాలకు హెనన్ అతి పెద్ద వేదికగా ఉంది. ఇక్కడనే ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీ కూడా ఉంది. శనివారం నుంచి కుండపోతగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఐఫోన్లు తయారుచేసే ఈ ప్రాంతపు రాజధాని జెంగ్జౌలో మంగళవారం ఒక్కరోజే 475 మిలీమిటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి ఇక్కడ కురిసిన సగటు వర్షపాతం 640 మిమీలకు పైగా నమోదైంది. వేయ్యేళ్ల కాలంలో ఇంతటి వానలు పడటం ఇదే తొలిసారని వాతావరణ అధికారులు తెలిపారు. జెంగ్జౌ నగరంలో ఏడాదిమొత్తం మీద పడే వాన కేవలం మూడు రోజులలో పడిందని, పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందనేది దీనితోనే తేలుతోందని చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్లోనది ఉధృత ప్రవాహం
భారీ వర్షాలతో ఈ ప్రాంతాన్ని ఆనుకుని సాగే ఎల్లో నది ఉరుకుల మీద ఉంది. వరదలను సృష్టిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వీధులా? నదులా అన్పిస్తున్నాయని వార్తా సంస్థలు తెలిపాయి. రోడ్లపై ఉండే కార్లు ఇతర వాహనాలు నీటిపై బోట్లలాగా తేలియాడుతున్నాయి. పలు వాహనాలు వరదలలో కొట్టుకుపొయ్యాయి. జౌంగ్జౌకు పశ్చిమాన ఉన్న ఇహెతన్ డ్యామ్ ఏ క్షణంలో అయినా కూలే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలోనే వరదలతో 12 మంది వరకూ మృతి చెందారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వాననీటిలో ఎటూ కదలలేని స్థితిలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు విలవిలలాడుతున్నారు.
పలు చోట్ల ప్రజలు నడుం లోతుకు పైగా నిలిచిన నీటిలోనే ఉండటంతో వారి తలలు కన్పిస్తూ ఉన్నాయి. బస్టాండ్‌లు, విమానాశ్రయ టర్మినల్స్‌లోకి వరదలు వచ్చి చేరుతున్నాయి. హెనన్ ప్రాంతంలో అనేక పట్టణాలు వానల తీవ్రతతో తల్లడిల్లాయి. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ తమ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల డ్యామ్‌లకు, రిజర్వాయర్లకు గండ్లు పడ్డాయి. ప్రాజెక్టుల వద్ద నీటి మట్టాలు ప్రమాద సూచిని దాటి ప్రవహిస్తున్నాయి. దీనితో ఈ ప్రాజెక్టుల నుంచి ఏ క్షణంలో అయినా నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది. దీనితో ఇక్కడి పల్లపు ప్రాంతాలు నిద్రలేకుండా గడపాల్సి వస్తోంది.
బందీలైన వేలాది మంది.. రంగంలోకి సైన్యం
ఈ ప్రాంతంలో భారీ వర్షాలతో ఇప్పటివరకూ బాధితులైన ప్రజల సంఖ్య దాదాపు 12 లక్షల 40 వేలకు పైగా ఉంటుంది. పలు ప్రాంతాలలో సబ్‌వేలు, హోటల్స్ , బహిరంగ స్థలాలు అన్నీ కూడా జలమయం అయ్యాయి. దీనితో వీటిలో జనం బందీఖానాల బతుకులు గడుపుతున్నారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, ఆశ్రయం కల్పించాలని ప్రెసిడెంట్ స్థానిక అధికారులనుఆదేవించినట్లు అధికార గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. పల్లపు ప్రాంతాల నుంచి దాదాపుగా 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు.
సబ్‌వే రైలుకు వరదతాకిడి 12 మంది బలి
హెనన్ ప్రాంతంలో సబ్‌వేలో వెళ్లుతున్న రైలుకు అతి వేగంగా వచ్చిన వరద ఢీకొనడంతో అందులోని 12 మంది ప్రయాణికులు చనిపొయ్యారు. పలువురు గల్లంతు అయ్యారు. స్టేషన్లను వరద నీరు ముంచెత్తింది. పలు ప్రాంతాలలో హృదయ విదారక దృశ్యాలు నెలకొన్నాయి. మంగళవారం రాత్రి నుంచి వర్షాలు సంబంధిత వరదల స్థాయి పెరుగుతూ వచ్చిందని హాంగ్‌కాంగ్ కేంద్రపు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. పలు చోట్ల గోడలు కూలడం, నీళ్లలో జనం కొట్టుకుపోవడం వంటి ఘటనలు జరిగాయి. జీవితకాలంలో ఇటువంటి భారీ వర్షాలు, తీవ్రస్థాయి వరదలు తానైతే చూడలేదని ఓ వాతావరణవేత్త తెలిపారు. క్యాపిటల్ జెంగ్‌జాహోవ్ మెట్రోపాలిటన్ సిటీలో పలు ప్రజా సంస్థల కార్యాలయాలు వేదికలు , సబ్‌వే టన్నెల్స్ వరదనీటితో మునిగాయి.
సబర్బన్ రైళ్లలో ….తలలోతు నీళ్లు
సబర్బన్ రైళ్లలోకి ప్రయాణికుల మెడల వరకూ ఇప్పుడు వరద నీరు చేరింది. దీనితో వారు ఉక్కిరిబిక్కిరి అవుతూ పైన ఉన్న హ్యాండిల్ బార్స్‌ను పట్టుకుని నిలిచి ఉన్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తాయి. ఈ ప్రయాణికుల ముఖాలు తప్ప శరీరం కన్పించడం లేదు. పలువురు భారీ స్థాయి మట్టిపెళ్లల కింద చతికిల పడాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లల స్కూళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరింది. వెంటనే వారిని అక్కడినుంచి బయటకు తీసుకువెళ్లారు.
తీవ్రస్థాయి వరద ముప్పు
చైనా అధ్యక్షుడి ఆందోళన
భారీ స్థాయి వర్షాలు కనివిని ఎరుగని స్థాయిలో విలయం కల్పించాయని చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాలలోకి వర్షపు నీరు వచ్చిచేరింది..జెన్‌ఝోహు ఇతర నగరాలలో జనం బయటకు కదలలేని స్థితిలో ఉన్నారు. పలు నదులలో నీటి మట్టాలు పెరిగాయి. ప్రమాద సూచీని దాటాయి. డ్యామ్‌లు, రిజర్వాయర్లుకు పగుళ్లు ఏర్పడ్డాయి. రైళ్లు, విమానాలను నిలిపివేసినట్లు దేశాధ్యక్షులు తెలిపారు. సైన్యం ఈ ప్రాంతానికి వెళ్లి పూర్తి స్థాయిలో సహాయ చర్యలను చేపట్టాలని, ముందుగా జలదిగ్బంధంలోని వారిని కాపాడాలని ఆదేశించారు. పారిశుద్ధ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అంటువ్యాధులు తలెత్తకుండా చూడాలని, ప్రజల బాగోగులు చూసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆసుపత్రులలో చీకట్లు
బకెట్లలో జనం ప్రయాణాలు
పలు ప్రాంతాలలో వర్షాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రులలో విద్యుత్ లేకపోవడంతో అత్యవసర చికిత్సలకు అంతరాయం ఏర్పడింది. దీనితో రోగులను ఇతర ప్రాంతాలకు అంబులెన్స్‌లలో తరలించారు. తాగే నీళ్లు లేవు, కరెంటు పోయింది, ఇంటర్నెట్ లేదని జెంగ్‌హోవూ నివాసి ఒకరు తెలిపారు. ఇళ్లల్లోకి నీరు చేరడం, వీధులు జలయం కావడంతో జనం పలు ప్రాతాలలో పెద్ద పెద్ద టబ్‌లలో కూర్చుని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది.